ఏపీలో దారుణం: కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు... ఒకరు మృతి.. 

ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని వసంత కెమికల్స్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రియాక్టర్ పేలడంతో భయంతో పరుగులు తీశారు కార్మికులు. మృతుడు ఒడిశాకు చెందిన ప్రదీప్ రౌత్ గా గుర్తించారు. పేలుడు సమయంలో భారీ శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు.

ఈ ప్రమాదంపై హోమ్ మంత్రి అనిత స్పందించారు. కలెక్టర్ కు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీసిన మంత్రి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి అనిత.