
- డ్రగ్స్ నిల్వలకు వ్యాపించి బ్లాస్టింగ్
- ఓ కెమిస్ట్ ఉద్యోగి మృతి
- మరో ముగ్గురి పరిస్థితి విషమం
- సంగారెడ్డి జిల్లా గుండ్ల మాచ్నూర్ లో ఘటన
సంగారెడ్డి (హత్నూర), వెలుగు : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్ల మాచ్నూర్ కొవాలెంట్ ఫ్యాక్టరీలో మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించి ఒక ఉద్యోగి చనిపోయాడు. మరో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. హత్నూర పోలీసులు, మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం..కోవాలెంట్డ్రగ్ ఫ్యాక్టరీలోని టీబీ బ్లాక్–-4లో ఉన్న రియాక్టర్ మెషినరీలో స్పార్క్‌తో పక్కనే ఉన్న డ్రగ్స్ నిల్వలకు మంటలు వ్యాపించాయి.
దీంతో ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న హత్నూరకు చెందిన కెమిస్ట్ వినోద్ కుమార్, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కార్మికులు ఫాదర్ మరాండి, లాల్ బాబ్ తూరి, స్వాధీన్ రాజులకు మంటలంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఈ విషయం గురించి ఎవరికీ చెప్పకుండా నలుగురిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించింది.
ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా మంగళవారం రాత్రి వినోద్ కుమార్ చనిపోయాడు. దీంతో యాజమాన్యం ఆయన కుటుంబీకులకు చెప్పింది. వారు ఇతర కార్మికులతో కలిసి ఫ్యాక్టరీ ముందు ధర్నా చేశారు. మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని, రక్షణ చర్యలు పాటించలేదని వారు ఆరోపించారు. అయినా యాజమాన్యం స్పందించకపోవడంతో సంగారెడ్డి-–నర్సాపూర్ మెయిన్‌రోడ్డుపై రాస్తారోకో చేశారు.
సాయంత్రానికి యాజమాన్యం దిగొచ్చి మృతుడి కుటుంబానికి పరిహారం కింద రూ.40 లక్షలు, అతడి భార్యకు ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.