హౌరా మెయిల్ రైలులో పేలుడు.. నలుగురికి గాయాలు

హౌరా మెయిల్ రైలులో పేలుడు.. నలుగురికి గాయాలు

చండీగఢ్: పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలో హౌరా మెయిల్ జనరల్ కోచ్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

పటాకుల కారణంగానే పేలుడు

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో రైలు అమృత్‌సర్‌ నుంచి హౌరాకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బాణసంచా ఉన్న ప్లాస్టిక్ బకెట్‌లో పేలుడు సంభవించించింది. ఈ ఘటనలో ఓ మహిళ సహా నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఫతేఘర్ సాహిబ్ సివిల్ ఆసుపత్రికి తరలించినట్లు GRP డీసీపీ జగ్మోహన్ సింగ్ తెలిపారు. 

Also Read :- రెండేళ్ల బాలుడిని ఇంట్లో నుంచి లాక్కొచ్చి వీధి కుక్కల దాడి

బాణాసంచా ఉన్న ప్లాస్టిక్ బకెట్‌లో పేలుడు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీసీపీ చెప్పారు. నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపినట్లు తెలిపారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతోందని వెల్లడించారు.