ఢిల్లీలో బాంబు పేలుడు 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. రోహిణి ప్రాంతంలోని ప్రశాంత్ విహార్ లో గల పీవీఆర్ మల్టీప్లెక్స్ సమీపంలో గురువారం ఉదయం 11.47 గంటలకు పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పాట్​కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఓ ఆటో డ్రైవర్ చేతన్ కుష్వాహా కు స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. అతడికి సమీపంలోని ఆస్పత్రిలో డాక్టర్లు ప్రథమ చికిత్సను అందించారని, తర్వాత డిశ్చార్జ్ చేశారని చెప్పారు.

ప్రస్తుతం ఈ ప్రాంతంలో అధికారులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. పేలుడు జరిగిన ప్రాంతంలో తెలుపు రంగు పొడిని గుర్తించారు. సరిగ్గా నెలరోజుల క్రితం ఇదే ప్రాంతంలోని సీఆర్పీఎఫ్‌‌ స్కూల్ ఎదుట పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా ఘటనాస్థలంలో తెలుపు రంగు పౌడర్‌‌ను పోలీసులు గుర్తించారు. తాజా పేలుడు కూడా నాటి ఘటనను పోలి ఉండటం ఆందోళనను రేకెత్తిస్తోంది. బాంబు పేలుడు ఘటనపై ఢిల్లీ సీఎం ఆతిశి మీడియాతో మాట్లాడారు. రెండు నెలల వ్యవధిలో రెండోసారి ఇక్కడే పేలుడు జరిగిందని పేర్కొన్నారు. ఢిల్లీవాసుల భద్రతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విస్మరిస్తున్నారని ఆరోపించారు.