ఎంత కిరాత‌కుడు వీడు : ల‌వ‌ర్ ను లారీ కిందకు తోసేశాడు

నిజాంపేట, వెలుగు:  ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు  వాటర్ ట్యాంకర్ లారీ కిందకు తోసి ప్రియుడు హత్య చేసిన ఘటన నిజాంపేట పరిధిలో జరిగింది.  బాచుపల్లి ఇన్ స్పెక్టర్ సుమన్ తెలిపిన  ప్రకారం.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం నెమలిగుట్ట తండాకు చెందిన హజియ కుతూరు ప్రమీల (24) బోరంపేట ఇందిరమ్మ కాలనీలో నలుగురు స్నేహితులతో కలిసి ఉంటోంది. ఈమె బాచుపల్లిలోని ప్రిస్టేజ్ షోరూంలో ఉద్యోగం చేస్తుంది.  

గతంలో ఈమెకు పెళ్లి కాగా భర్త చనిపోయినట్లు సమాచారం.  కొండాపూర్‌‌లో నివసిస్తూ కారు డ్రైవర్‌‌గా పని చేస్తున్న నెమలిగుట్ట సమీప తండాకు చెందిన తిరుపతితో ప్రమీల కు పరిచయం ఏర్పడింది.  ఆరు నెలలుగా ఇద్దరూ  ప్రేమించుకుంటున్నారు. ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రగతినగర్ బాచుపల్లి రహదారిలో పెళ్లి విషయమై చర్చించుకున్నారు.  తిరుపతిని ఈ రోజే పెళ్లి చేసుకోవాలని ప్రమీల ఒత్తిడి చేసింది.  

కొంతకాలం తర్వాత చేసుకుందామని తనకు  ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని తిరుపతి  చెప్పాడు.  దీంతో ఇద్దరి మధ్య వాదన పెరిగి గొడవకు దారితీసింది.  డివైడర్ పక్కన నడుస్తున్న క్రమంలో ఆవేశంతో ప్రమీలను తిరుపతి అటుగా వస్తున్న వాటర్ ట్యాంకర్ లారీ కిందకు తోసేశాడు.  దీంతో ఆమె స్పాట్ లోనే చనిపోయింది.