ప్రస్తుతం ప్రపంచ ఎగుమతుల్లో 45 శాతం వాటా ఉన్న మన దేశం మున్ముందు 70 శాతానికి పైగా వాటాను సాధించే అవకాశం ఉంది. ఎగుమతులను వ్యాపార కోణంలో కాకుండా, రైతుల ప్రయోజనాల దృష్టితో ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పన్నుల విధానాన్ని సరళీకృతం చెయ్యాలి. ప్రపంచంలో అతిపెద్ద ఆహార పంటల ఉత్పత్తిదారుగా భారత్ నుంచి ఎగుమతులకు అపార అవకాశాలు ఉన్నాయి. వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు. దేశీయ అవసరాలు పోను 30 శాతం పైగా అన్ని ఆహార పంటలను విదేశాలకు ఎగుమతి చేస్తే, ఇటు రైతులకు అటు దేశానికి భారీగా ఆదాయం వచ్చే వీలుంటుంది. బియ్యం దేశీయ వినియోగం పోగా మిగిలిన దాంట్లో 40 శాతం ఎగుమతులకు వీలుంటుంది. కానీ, 15 శాతంలోపే ఎగుమతులు జరుగుతున్నాయి. అయినా, బియ్యం ఎగుమతుల్లో ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలోనే ఉండడం మనం ఎంతో సంతోషించదగ్గ పరిణామం. 2023లో ఇక్కడి నుంచి 17 మిలియన్ టన్నుల బియ్యం అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, సింగపూర్, కెనడా, బంగ్లాదేశ్, యూఏఈ, ఫిలిప్పీన్స్ తదితర 100 దేశాలకు ఎగుమతి అయ్యాయి. తద్వారా మనకు 70 వేల కోట్ల రూపాయల విలువైన విదేశీ మారక ద్రవ్యం లభించింది. 2030 నాటికి 30 మిలియన్ టన్నుల బియ్యం ఎగుమతులకు అవకాశం ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వ విధానాలు కఠినంగా ఉన్నాయి.
ఎగుమతులపై పన్నుల భారం
బియ్యం ఎగుమతులపై ప్రస్తుతం 20 శాతం మేర సుంకం ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఎగుమతి సుంకం ఉండదు. దీనితో పాటు మన ఎగుమతులకు కస్టమ్స్ సమస్యలున్నాయి, స్థిరమైన విధానం లేకపోవడం దీనికి ముఖ్య కారణం. ఎగుమతులను ఉచితంగా అనుమతించాలని, లేదా టన్నుకు 80 డాలర్ల స్థిర ఎగుమతి సుంకాన్ని విధించాలని కేంద్రాన్ని కోరుతున్నా స్పందించడం లేదు. ఎగుమతులను తరచూ నిషేధించడం వల్ల వృద్ధి ప్రభావితమవుతుంది. దేశంలో ఏటా రెండు, మూడు పంటలు పండుతున్నాయి, వాటిని ఎగుమతులకు వినియోగించుకునే వెసులుబాటు కలగాలి. రవాణా, హ్యాండ్లింగ్ చార్జీలు ఏటేటా పెరగడం భారంగా ఉంటోంది. సాగులో దిగుమతులు తగ్గినప్పుడు నిల్వల వినియోగంపై కేంద్రం దృష్టి సారించాలి. ఎగుమతులను నిషేధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
ALSO READ : వంతెనలా..పేకమేడలా.!
సేంద్రీయ పంటలకు డిమాండ్
సేంద్రీయ పంటలకు మంచి డిమాండ్ ఉంది. మన దేశం నుంచి ఎగుమతయ్యే బియ్యానికి డిమాండ్ పెరుగుతోంది. అమెరికా, యూరప్, మధ్య ప్రాచ్య దేశాల్లో మాత్రం ఎరువులు, పురుగుమందులు వాడని బియ్యం కావాలని కోరుతున్నారు. ఇది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. దాదాపు 16 మిలియన్ టన్నుల మేరకు ఈ డిమాండ్ ఉండగా పాకిస్తాన్ తదితర దేశాలు ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాయి. ఈ సమస్య నివారణకు రైతులను చైతన్యవంతులను చెయ్యాలి. సేంద్రీయ, ప్రకృతి విధానంలో పండిన పంటలకు ఎగుమతుల్లో అత్యధిక డిమాండ్ ఉంటుంది. వాటికి కోరిన ధర కూడా లభిస్తుంది. సేంద్రీయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలి. ప్రపంచవ్యాప్తంగా వరిపై పరిశోధన, ఆవిష్కరణలకు వెచ్చిస్తున్న భారీ మొత్తాన్ని భారీగా పెంచాలి.
వరి సాగులో తెలంగాణ ముందంజ
తెలంగాణలో పండే సోనా మసూరీ తదితర రకాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం ఉంది. అందుకు అనుగుణంగా ఎగుమతుల ద్వారా అన్ని విధాలా రైతులు లబ్ధి పొందేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తామని తెలిపింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై వెంటనే నిషేధాన్ని ఎత్తివేసి ప్రోత్సాహం అందించాలి. తెలంగాణ రాష్ట్రం వరి సాగులో అద్భుతాలు సాధిస్తోంది. గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో 26 మిలియన్ టన్నుల వరి ఉత్పత్తి జరిగింది. బియ్యం ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం ప్రధాన భాగస్వామిగా నిలిచింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లోని ఖరీఫ్ సీజన్‌లో వరిసాగు విస్తీర్ణం 13.89 లక్షల హెక్టార్లు ఉండగా, తొమ్మిదేండ్ల తర్వాత ఏకంగా సాగు విస్తీర్ణం రెట్టింపు కావడం గమనార్హం. గతేడాది రికార్డు స్థాయిలోనే 26.30లక్షల హెక్టార్లలో వరిని పండించారు. సాధారణంగా ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో 20.17 లక్షల హెక్టార్లలో వరి సాగవుతుంది. కానీ. అంతకు మించి దాదాపు 6.13 లక్షల హెక్టార్ల వరి సాగు విస్తీర్ణం పెరగడం హర్షించదగ్గ పరిణామమే.
ALSO READ : విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయించాలి
వరికి మద్దతు ధర పెంచాలి
రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు తీసుకోవడంతోపాటు పంటలకయ్యే వ్యయాలను పరిగణనలోకి తీసుకొని జాతీయ వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ సిఫార్సు చేస్తే కేంద్ర కేబినెట్ నిర్ణయం
తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులను అంచనా వేసి కమిషన్ కు నివేదించినా అది అమలు కావడం లేదు. వరి సాధారణ రకానికి రూ.3,000 ఏ- గ్రేడ్ రకానికి రూ. 3,200 మద్దతు ధర ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిపార్సు చేసింది. కానీ, కేంద్రం వరి సాధారణ రకానికి రూ. 2,300 ఏ- గ్రేడ్ రకానికి రూ. 2,320 మాత్రమే ప్రకటించి నిరాశపరిచింది. రాష్ట్రంలో దాదాపు 220 రకాల ధాన్యం ఉత్పత్తి జరుగుతోంది. ధాన్యం ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఇటీవలే క్వింటాలు ధాన్యానికి 500 రూపాయల బోనస్ కూడా ప్రకటించడం రైతులకు ఎంతో ఆనందాన్నిచ్చింది.
- బి. రాజేష్ కుమార్, డిప్యూటీ కమిషనర్, జీహెచ్ఎంసీ