కౌంటరు వేసే వరకు రోజుకు రూ.1,000 చెల్లించండి

కౌంటరు వేసే వరకు రోజుకు రూ.1,000 చెల్లించండి
  • ఐఏఎంసీకి భూమి కేటాయింపు కేసులో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఐఏఎంసీకి భూకేటాయింపు, నిధుల కేటాయింపు, ప్రభుత్వ కేసులను ఆర్బిట్రేషన్‌‌ కేంద్రానికి పంపాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసంతప్తి వ్యక్తం చేసింది. కౌంటరు దాఖలు చేసేదాకా రోజుకు రూ.వెయ్యి చొప్పున రాష్ట్ర లీగల్‌‌ సర్వీసెస్‌‌ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. ఎన్ని రోజుల్లో దాఖలు చేస్తే అన్ని వేలు చెల్లించాలని ఆదేశించింది.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌‌దుర్గ్‌‌ సర్వే నం.83/1లో 3.70 ఎకరాలను కేటాయించడంతోపాటు ఏడాదికి రూ.3 కోట్ల ఆర్థిక సాయం, ప్రభుత్వ కేసులను ఐఏఎంసీకే పంపాలని ఉత్తర్వులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ వ్యక్తిగత హోదాలో న్యాయవాది కోటి రఘునాథరావు, మరో న్యాయవాది ఎ.వెంకట్రామిరెడ్డి గతేడాది ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌ కె.లక్ష్మణ్, జస్టిస్‌‌ కె.సుజనలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది.

ఐఏఎంసీ తరఫు న్యాయవాది ఎం.అభినయ్‌‌రెడ్డి కౌంటరు దాఖలు చేసినట్లు తెలిపారు. ఇతర ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శుల తరఫున కౌంటరు దాఖలు చేయడానికి మరికొంత గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా ధర్మాసనం అసంతప్తి వ్యక్తం చేసింది. ఇంతటి కీలకమైన విషయంలో కౌంటరు ఎందుకు దాఖలు చేయట్లేదని  ప్రశ్నించింది. విచారణను సెప్టెంబరు 20కి వాయిదా వేస్తూ అప్పటిలోగా కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది.