- ఊరు విడిచిపెట్టి వేరే గ్రామంలో ఉంటున్నాం
- కలెక్టర్‌కు ఓ కుటుంబం ఫిర్యాదు
మెదక్, వెలుగు : భూమి ఇవ్వలేదని తమను కుల బహిష్కరణ చేశారని, దీంతో ఊర్లో ఉండలేక మరో గ్రామంలో ఉంటున్నామని చేగుంట మండలం వల్లభాపూర్ కు చెందిన ఓ కుటుంబం శుక్రవారం కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు ఫిర్యాదు చేసింది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బత్తుల లింగమయ్య, రాజవ్వ కుటుంబానికి సర్వే నెంబర్209/26లో 11 గుంటల అసైన్ భూమి ఉంది. 25 ఏండ్ల కింద ఆ భూమిని మరొకరి దగ్గర నుంచి కొనుగోలు చేసి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
మూడేళ్ల కింద గ్రామనికి చెందిన యాదవులు కొందరు, సర్వేయర్‌ను తీసుకొచ్చి దౌర్జన్యంగా జేసీబీతో సాగు చేసిన పంటను ధ్వంసం చేశారని, అలా ఎందుకు చేస్తున్నారని అడిగితే కుల బహిష్కరణ చేశారని ఆరోపించారు. మూడేళ్లుగా మల్లికార్జున స్వామికి బోనాలు తీయనివ్వడం లేదని, కులానికి సంబంధించిన ఎవరైనా చనిపోతే వెళ్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షెడ్డు నిర్మాణం కోసం తమ భూమి ఇవ్వమంటున్నారని అందుకు ఒప్పుకోకపోవడంతో గతేడాది తమపై దాడి చేసి కొట్టారని, ప్రాణ భయంతో గ్రామం నుంచి వెళ్లి పోయి నార్సింగిలో
ఉంటున్నామని లింగమయ్య, రాజవ్వ, వారి కొడుకు, కోడలు మహేశ్, కల్యాణి తెలిపారు. తమను కుల బహిష్కరణ చేసిన విషయమై నార్సింగి పోలీసులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ జరిపి న్యాయం చేయాలని, తమను కుల బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా బీసీ వెల్ఫేర్ఆఫీసర్నాగరాజు గౌడ్‌ను ఆదేశించారు.