ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. మే7 వరకు (14 రోజులు) పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు ఇచ్చారు. కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియగా ఆమెను ఈడీ,సీబీఐ వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు. కవితను 14 రోజులపాటు కస్టడీ పొడిగించాలని ఈ సందర్భంగా ఈడీ, సీబీఐ కోర్టును కోరాయి.
అయితే కొత్త అంశాలను ఏమీ ఈడీ జత చేయలేదని.. కస్టడీ అవసరం లేదంటూ కవిత తరపు న్యాయవాది వాదించారు. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని.. కేసు విచారణ పురోగతిపై ప్రభావం ఉంటుంది కాబట్టి కస్టడీ పొడిగించాలని ఈడీ న్యాయవాది కోర్టును కోరారు. సాక్ష్యాలను తారుమారు చేస్తారని కవితను అరెస్ట్ చేసిన రోజునుంచి ఈడీ ఆరోపిస్తుందని.. కానీ కొత్తగా ఏం చెప్పడం లేదంటూ కవిత తరపు న్యాయవాది రాణా కోర్టుకు తెలిపారు.
Also Read: పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్...
కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు అందజేశారు. 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జిషీట్ సమర్పిస్తామని కోర్టుకు తెలిపింది ఈడీ. ఇరువైపు వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జ్యూడీషియల్ కస్టడీ పొడగింపుకే మొగ్గుచూపింది. తదుపరి విచారణను మే7కి వాయిదా వేసింది. కాగా లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో మార్చి 15 న కవిత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.