
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. గతంలో విధించిన కస్టడీ ముగియడంతో శుక్రవారం కవితను జైలు అధికారులు వీడియో కాన్ఫరెన్స్(వీసీ) ద్వారా హాజరు పరిచారు. ఈ సందర్భంగా కవిత కస్టడీని పొడిగించాలని సీబీఐ తరఫు అడ్వకేట్లు కోర్టును కోరారు. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 21 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శుక్రవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్‌లో కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ చార్జ్ షీట్ ను దాఖలు చేసింది.
దాదాపు 2 వేలకు పైగా పేజీలలో కవిత రోల్‌ను సీబీఐ పేర్కొన్నట్టు తెలి సింది. శుక్రవారం కవితపై దాఖలు చేసి న సప్లిమెంటరీ చార్జ్ షీట్ అంశాన్ని సీబీఐ తరఫు అడ్వకేట్లు రౌస్ ఎవెన్యూ కోర్టు దృష్టికి తెచ్చారు. చట్టప్రకారం ఇన్ టైంలోనే కవితపై ఈ చార్జ్ షీట్ ను దాఖలు చేశామని, దీనిని పరి గణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. అయితే, చార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై జులై 6న విచారణ చేపడుతామని కోర్టు వెల్లడించింది. ఇప్పటికే ఈ కేసులో ఈడీ సప్లిమెంటరీ చార్జ్ షీట్ దాఖలు చేయగా.. ఈ నెల 3న దానిని పరిగణనలోకి తీసుకుంటున్నట్టు కోర్టు స్పష్టం చేసింది. ఆ చార్జ్ షీట్ పై విచారణను జులై 3కు వాయిదా వేసింది.