ఉమ్మడి వరంగల్ జిల్లా లో ఆగమాగం.. కుదేలై రైతులు
వరంగల్ ఉమ్మడి జిల్లా: వారం పది రోజులపాటు ఎడ తెరిపిలేకుండా కురిసిన హోరు వానలు.. వరదలతో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పంటలన్నీ నాశనమయ్యాయి. జోరు వానలు రైతులను ఆగమాగం చేసాయి. వర్షాలు.. వరదల దెబ్బకు రైతులు కుదేలయ్యారు. అష్ట, కష్టాలు వరి నాట్లు వేస్తే…భారీ వర్షాలు .. వరదలు వరి పంటలను ముంచేశాయి. మొక్కజొన్న చేలు నీటిలో కోట్టుకు పోయాయి. పత్తి చేలల్లో పెద్ద ఎత్తున నీరు నిలిచి ఎర్ర బారి పోతుండగా, వర్షపు నీరు నిలిచి పత్తి పంటకు వేరుకుళ్లు తెగుళ్లు సోకిందని రైతులు కన్నీరు మున్నీరు అవుతుమవుతున్నారు. వరద ఉదృతికి చెరువులకు గండ్లు పడి పంట ల్లో ఇసుక మేటలు పెట్టిన పంటపోలాలను చూసిన రైతులు అంధోళన చెందుతున్నారు. తమను ఆదుకునే హస్తం కోసం రైతులు గంపెడు ఆశలు పెట్టుకుని ఉండగా… అధికారులు దెబ్బ తిన్న పంటల నివేదికలు తయారు చేశారు. తమ పొలాల వైపు రాకుండా.. కనీసం చూడకుండా పంటల నష్టం అంచనా ఏలా వేస్తారంటూ రైతులు వ్యవసాయ శాఖ అదికారుల తీరును ప్రశ్నిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, మహ బూబా బాద్ జిల్లాల రైతులు ఎన్నడు లేని విదంగా తీరని నష్టాల పాలయ్యారు. పంటలు ఏపుగా పెరుగుతున్న తరుణంలోనే భారీ వర్షాలు కురవటం.. కుండపోత వానలకు వాగులు.. వంకలు పొంగడంతో పొలాలు నీట మునిగాయి. మున్నేరు వాగు పొంగడంతో 50 కిలోమీటర్ల దూరం వరకు కాలువ రెండు పక్కల పదెకరాల వరకు పంటపొలాలు దెబ్బతిన్నాయి.
పాకాల, రామప్ప, లక్నవరం చెరువుల కింద ఉన్న ఆయకట్టు వరి పంటలు కూడా పెద్ద ఎత్తున నీట మునిగాయి.వారం రోజులుగా నీటిలో ఉండటంతో మురిగి పోతున్నాయని రైతులు అంధోళన వ్యక్తం చేస్తు న్నారు.వరి పంటలు నీట మునిగితే పత్తిలో నీరు నిలిచి ఎర్రబారి పోయి,పూత,కాతతో పిందెలు రాలి పోతుందని, పెసర కాయలు మొలుకలు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు.మక్కజోన్న చేలల్లో నుండి వరద నీటికి కింద పడి పోగా మక్క జోన్న కంకి చేతికి రాకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.కూరగాయల పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు వాపోయారు.
విస్తారంగా కురిసిన వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది.వరదల ప్రవాహానికి వాగులు పొంగి పోర్లగా ,చెరువులు అలుగులు పడటంతో వరద తాకిడికి పంట పొలాల్లో మట్టి పేరుకు పోయింది. మరి కొన్నిచోట్ల గండి పడి దెబ్బతిన్నాయి. వరద తాకిడికి పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో పంట పొలాలు పూర్తిగా నాశనమయ్యాయి. చెరువులకు గండి పండిన చోట వరి పొలాలు కోతకు గురై పూర్తిగా అక్కరకు రాకుండా పోయాయి. ఈ మేరకు వ్యవసాయ శాఖ అదికారులే 3.41 లక్షలకు పైగా పంట నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదిక పంపారు. తమ పంటలను ప్రజా ప్రతినిదులు,వ్యవసాయ శాఖ అధికారులు సందర్శించ లేదు. ఏ మాత్రం చూడకుండానే నివేదికలు ఇస్తారని రైతులు అదికారుల తీరును ప్రశ్నిస్తున్నారు.
వారం రోజుల పాటుగా కురిసిన వానలకు వరి, పత్తి,మక్కజొన్న పంటలు పెద్ద ఎత్తున నీట మునిగాయి. కందితో పాటు పెసర పంటకు తీరని నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు. పంట పొలాల్లోకి ఇసుక మేటలు వేశాయి.మరి కొన్ని చోట్ల వరద తాకడికి పంట పొలాల్లోకి ఒండ్రు మట్టి చేరింది. పంటలపై మట్టి కప్పేయటంతో పంటలు చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కోనారెడ్డి చెరువుకు గండి పడటంతో ఆ చెరువు కింద వరి పంట వరద నీటిలో కొట్టుకు పోయాయని వంగపహాడ్ కు చెందిన రైతు మధు, ఆర్వపల్లికి చెందిన రైతు సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపుగా పెరుగుతున పత్తి చేలను చూసి ఎంతో మురిసి పోయాం. పూత వస్తుండటంతో ఈ సారి దిగుబడి ఎక్కువగా వస్తుందని భావించాం. కానీ భారీ వర్షాల కారణంగా పత్తి పంట ఎర్రబారుతుండగా, నీరు నిలిచిన చోట వేరుకుళ్లు తెగుళ్లు సోకిందని వరంగల్ రూరల్ ,భూపాల పల్లి, వరంగల్ అర్బన్ జిల్లా రైతులు వాపోతున్నారు. వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కానీ పంటలను పరిశీలిం చేందుకు వ్యవసాయ శాఖ అదికారులు తమ వైపు కన్నెత్తి చూడటం లేదని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కు చెందిన రైతు కొమురయ్ ఇదే జిల్లాలోని చిట్యాలకు చెందిన రాజు అనే రైతు ఆరోపించారు.
వరి సొలాలను వరద ముంచెత్తడంతో పలు చోట్ల ఇసుక మేటలు వేసాయి. చెరువులు గండి పడిన చోట పోలాలు నీట మునిగాయి. దీని వల్ల వరి నాట్లు వేసుకునే అవకాశం లేకుండా పోయిందని ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు తీవ్రగా నష్ట పోయినా అదికారులు,ప్రజా ప్రతినిదులు తమ వైపు కన్నెత్తి చూడలేదని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు కు చెందిన రైతు ప్రశాంత్ అంటున్నారు.
పంట నష్టంపై ప్రాథమిక అంచనా నివేదికలే పంపాం:
` వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా అంచనా వేసాం.నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం. ఇవన్నీ ప్రాథమిక అంచనాలే.. వరి పంటలకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం… పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సలహాలు.. సూచనలు ఇస్తున్నాము –ఉష, వ్యవసాయశాఖ అధికారి, వరంగల్ రూరల్ & అర్బన్ జిల్లా
జిల్లాల వారీగా పంట నష్టం ..
వరంగల్ అర్బన్: 11,759 ఎకరాల్లో వరి, 4,643 ఎకరాల పత్తి పంట దెబ్బతింది. 11,419 మంది రైతులు నష్టపోయినట్లు ఆఫీసర్లు గుర్తించారు.
వరంగల్ రూరల్ : వరి 29,195 ఎకరాలు, పత్తి 58,885, కంది 340, పెసర 578, సోయాబీన్ 62, మినుములు 58, వేరుశనగ 5,869, మొక్క జొన్న 302 ఎకరాల్లో నీట మునిగాయి. మొత్తంగా 56,274 మంది రైతులు నష్టపోయినట్లు ఆఫీసర్లు అంచనాలు తయారు చేశారు.
జయశంకర్ భూపాలపల్లి: 26,049 మంది రైతులకు చెందిన 27,894 ఎకరాలు నీట మునిగాయి.
మహబూబాబాద్ జిల్లా: వరి 11,734 ఎకరాలు, పత్తి 2,418, పెసర 238, వేరుశనగ 14, మొక్క జొన్న 491, నువ్వులు 5 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. జిల్లాలో మొత్తంగా 17,375 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.
జనగామ జిల్లా : వరి 4,300 ఎకరాలు, పత్తి 3,100 ఎకరాలు, పెసర 515 ఎకరాలు కలిపి మొత్తంగా 7,915 ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
ములుగు జిల్లా : వరి 6,978 ఏకరాల్లో ,4 వేల ఏకరాలో పత్తి,మిర్చి పంటలు దెబ్బతినగా 3 వేల ఎకరాల్లో ఇతర పంటలతో పాటుగా కూరగాయలు దెబ్బతిన్నాయని రైతులు చెబుతున్నారు.మొత్తంగా 13 వేల ఎకరాల్లో పంటలు దెబబ్తిన్నాయని వ్యవసాయ శాఖ అదికారులు అంచనా వేస్తున్నారు.