ఖమ్మంలో ఇంటర్నేషనల్ దోపిడీ !

ఖమ్మంలో ఇంటర్నేషనల్ దోపిడీ !
  •     రూ.లక్షన్నర నుంచి ఐదు లక్షల వరకు ఫీజుల వసూళ్లు 
  •     అనుమతులు లేకున్నా ముందుగానే అడ్మిషన్లు
  •     పర్మిషన్లు ఒక పేరుతో..  నడిచేది మరో పేరుతో
  •     చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్న ఆఫీసర్లు!

ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రైవేట్   స్కూళ్లలో ఫీజుల పేరిట దోపిడీ జరుగుతోంది.  ఇంటర్నేషనల్, గ్లోబల్, టెక్నో.. ఇలా అందమైన పేర్లతో స్కూళ్లు ఓపెన్​ చేసి, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఖమ్మంలో యూకేజీ చదువుకు రూ.లక్షన్నర ఫీజు వసూలు చేస్తున్న కొన్ని స్కూళ్లు, యూనిఫామ్స్, బుక్స్, ఇతర ఖర్చులు కలుపుకొంటే రూ.2లక్షల వరకు పేరెంట్స్​ కు టోపీ పెడుతున్నారు. ఎలాంటి పర్మిషన్లు లేకుండానే భారీ బిల్డింగ్, కలర్​ ఫుల్ బ్రోచర్లతో ఫుల్​పబ్లిసిటీ చేసుకొని పేరెంట్స్​ ను బురిడీ కొట్టిస్తున్నారు.

స్కూల్ మేనేజ్​మెంట్ల పబ్లిసిటీ మాయలో పడిన తల్లిదండ్రులు, వాటికి విద్యాశాఖ నుంచి అనుమతులున్నాయా, లేదా అని చూడకుండానే వారి పిల్లలను జాయిన్​ చేస్తున్నారు. ఖమ్మం నగరంలోనే ఈ ఏడాది ప్రారంభమైనవి, రెండు మూడేళ్లుగా నడుస్తున్నవి కలుపుకొని దాదాపు 10 స్కూళ్లకు పూర్తి స్థాయి పర్మిషన్లు లేవని తెలుస్తోంది. అలాంటి ప్రైవేట్ స్కూళ్లను కట్టడి చేయాల్సిన విద్యాశాఖ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కార్పొరేట్​ యాజమాన్యాల ఒత్తిళ్లు, రాజకీయ పలుకుబడి ఉండడంతో ‘మామూలు’గా తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. 

పాత స్కూళ్లకు కొత్త పేర్లు.. 

ఖమ్మంలో చిన్న, పెద్దవి కలిపి 100కు పైగా ప్రైవేట్ స్కూళ్లున్నాయి. వీటిలో పదికి పైగా కార్పొరేట్ మేనేజ్​మెంట్ల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లున్నాయి. కొన్ని స్కూళ్లయితే మూడు నాలుగు చోట్ల బ్రాంచ్​ లు ఓపెన్​చేసి మరీ విద్యను వ్యాపారంగా మార్చేశారు. పాత స్కూళ్లను టేకోవర్​చేసి, వాటికి కొత్త పేర్లు పెట్టి నడిపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ పేరుతో పర్మిషన్​ఉందో, ఆ పేరుతోనే స్కూల్​ ను నడిపించాల్సి ఉండగా ఆ రూల్స్ ను లైట్ తీసుకుంటున్నారు. ఇక ఈ ఏడాది నాలుగు పెద్ద సంస్థలు, భారీ బడ్జెట్ తో స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నాయి.

వాటిలో ఒక్క దానికి కూడా పర్మిషన్ లేకపోయినా, కేవలం మున్సిపాలిటీ నుంచి తీసుకున్న బిల్డింగ్ పర్మిషన్లను చూపిస్తూ పేరెంట్స్​ ను మోసం చేస్తున్నారు. నగరం మొత్తం బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లతో మార్కెటింగ్ జిమ్మిక్కులను చూసి, పిల్లలను ఆ స్కూళ్లలో జాయిన్ చేసేందుకు వెళ్తే మేనేజ్​ మెంట్లు చెబుతున్న ఫీజులు చూసి వారికి దిమ్మ తిరుగుతోంది. ఎల్​కేజీ, యూకేజీ చదువులకే రూ.లక్షకు పైగా ఫీజులు చెబుతున్నారు.

పూర్తి స్థాయిలో బిల్డింగ్ లు నిర్మాణం పూర్తి కాకుండా, క్లాస్​ రూమ్​లు సిద్ధం కాకుండా తాము పర్మిషన్లు ఇవ్వబోమని విద్యాశాఖ అధికారులు చెబుతుండగా, అడ్మిషన్లు కూడా తీసుకోవద్దని వారికి ముందుగానే చెప్పామంటున్నారు. కానీ, ఆఫీసర్ల ఆర్డర్లను పట్టించుకోకుండా ప్రతి స్కూల్​లో ప్రస్తుత విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు కొనసాగుతున్నాయి.

అన్ని వస్తువులూ అక్కడే కొనాలే.. 

ప్రతిఏటా ఫీజులు 20 శాతం నుంచి 30 శాతం వరకు పెంచుకుంటూ పోవడం ఒక ఎత్తయితే, స్టూడెంట్స్​ కు అవసరమయ్యే బుక్స్, పెన్స్, బెల్ట్, సాక్స్​లు, యూనిఫామ్​.. ఇలా అన్నీ స్కూళ్లలోనే అంటగడుతున్నారు. స్కూల్ ను ఆనుకొని తమ సిబ్బందితోనే షాప్​ ఏర్పాటు చేయించి కొందరు ఇవన్నీ అమ్ముతుండగా, మరికొందరు ప్రత్యేకంగా కొన్ని షాపులతో ఒప్పందం చేసుకొని వాటిలోనే తీసుకోవాలని పేరెంట్స్​ కు చెబుతున్నారు.

సెకండ్​ క్లాస్​ స్టూడెంట్ కు రూ.3వేలు, ఫిఫ్త్ క్లాస్​ కు అయితే రూ.9వేలు కేవలం బుక్స్​ కే ఖర్చు చేయాల్సి వస్తోంది. టెన్త్ క్లాస్​ కు రూ.15 వేలవరకు పై ఖర్చులు తప్పడం లేదు. వీటిపై ఆఫీసర్లు మాత్రం మౌనంగానే ఉంటున్నారు. తమకు కంప్లైంట్ వస్తే చర్యలు తీసుకుంటామని మాత్రమే చెబుతున్నారు. 

ఖమ్మంలో పదికి పైగా స్కూళ్లకు పర్మిషన్లు లేవు

ప్రైవేట్ స్కూళ్ల మేనేజ్ మెంట్లకు కొందరు విద్యాశాఖ అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ఖమ్మంలోనే పదికి పైగా స్కూళ్లకు పర్మిషన్లు లేకున్నా వారిపై చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో పర్మిషన్ లేని స్కూళ్లకు సంబంధించిన వివరాలు ఇవ్వడానికి కూడా వెనుకాడుతున్నారు. మేనేజ్​ మెంట్లతో రహస్యంగా ఆర్థిక సంబంధాలు ఉండడం వల్లే ఆఫీసర్లు వారిపై చర్యలు తీసుకోవడం లేదు. 

- మస్తాన్, పీడీఎస్​యూ జిల్లా కార్యదర్శి

పర్మిషన్లు లేకుండా అడ్మిషన్లు తీసుకోవద్దు

స్కూళ్లకు పర్మిషన్లు లేకుండా అడ్మిషన్లు తీసుకోవద్దని మేనేజ్​ మెంట్స్​ కు చెబుతున్నాం. ఏ పేరుతో అనుమతి ఉందో.. అదే పేరును స్కూల్ ముందు బోర్డు పెట్టాలి. పేర్లలో వారికి ఇష్టం వచ్చినట్లు ఇంటర్నేషనల్, గ్లోబల్, టెక్నో అంటూ చేర్చడానికి వీల్లేదు. వాటిని మారిస్తేనే అనుమతులిస్తున్నాం. పర్మిషన్​ లేదని ప్రత్యేకంగా ఏదైనా స్కూల్ గురించి పేరెంట్స్​ కంప్లైంట్ చేస్తే తప్పకుండా వాటిపై యాక్షన్​ తీసుకుంటాం.        - 

సోమశేఖర శర్మ, డీఈవో, ఖమ్మం