- కమీషన్లు ఇచ్చే హాస్పిటల్స్‌కు పేషెంట్ల తరలింపు
- సరైన ట్రీట్మెంట్ అందక గాల్లో కలుస్తున్న ప్రాణాలు
- అధికారుల కంట్రోల్ లేకపోవడంతోనే ఆగడాలు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో అంబులెన్స్‌ల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఓవైపు అడ్డగోలుగా కిరాయిలు వసూల్ చేస్తూ.. మరోవైపు హాస్పిటల్స్ ఇచ్చే కమీషన్ల కోసం కొందరు డ్రైవర్లు కక్కుర్తి పడుతున్నారు. కమీషన్ ఇచ్చే ప్రైవేట్ హాస్పిటల్స్ కు పేషెంట్లను తరలిస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. జిల్లా కేంద్రంలో దాదాపు 80 అంబులెన్స్‌లు ఉన్నాయి. వీరంతా యూనియన్‌గా ఏర్పడి గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా పాయింట్ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో 55 మంది ఉండగా, కొందరికి 2–3 అంబులెన్స్‌లు ఉన్నాయి. వీరిలో కొందరు ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు.
30 – 40 పర్సెంట్ కమీషన్ ఆశ చూపడంతోనే..
సరైన సౌకర్యాలు, క్వాలిఫైడ్ డాక్టర్లు లేని ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వాహకులు అంబులెన్స్‌లపై ఆధారపడి కమీషన్లు అలవాటు చేశారు. మాయమాటలు చెప్పి ఒక పేషెంట్‌ను అడ్మిట్ చేస్తే 30 నుంచి 40 పర్సెంట్ఇస్తామని ఆశ చూపిస్తున్నారు. రూ.లక్ష బిల్లు అయితే రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఇస్తున్నారు. నెలంతా కొట్టే కిరాయిల కన్నా కమీషన్లే లాభదాయకంగా ఉండటంతో.. చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న పేషెంట్లను కాపాడాలనే మానవత్వాన్ని మరిచి ఇలా వ్యవహరిస్తున్నారు. మంచిర్యాలతో పాటు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌లోని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌తో టైఅప్ అయ్యి దోపిడీ దందా సాగిస్తున్నారు.
గాల్లో కలుస్తున్న ప్రాణాలు
కొంతమంది అంబులెన్స్ నిర్వాహకుల అత్యాశ వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అన్ని సౌకర్యాలున్న మంచి హాస్పిటల్స్‌కు కాకుండా కమీషన్లు ఇచ్చే దవాఖానాల్లో చేర్పించడం వల్ల అక్కడ సరైన ట్రీట్మెంట్ అందక పేషెంట్ల ఊపిరాగుతోంది. మార్చి 29న లక్సెట్టిపేటకు చెందిన సింధూజకు యాక్సిడెంట్లో తీవ్ర గాయాలు కావడంతో మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. కండీషన్ సీరియస్‌గా ఉండడంతో వెంటనే హైదరాబాద్ తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు.
కానీ, అంబులెన్స్ డ్రైవర్ మొదట మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి కరీంనగర్‌లోని మరో హాస్పిటల్‌కు తీసుకెళ్లమని కోరినా వినిపించుకోకుండా సరైన సౌకర్యాలు, డాక్టర్లు లేని మరో దవాఖానాకు తీసుకెళ్లాడు. అనంతరం ఇంకో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తుండగానే సింధూజ బ్రెయిన్ డెడ్ అయ్యింది. అరగంట ముందు తీసుకొస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని డాక్టర్లు చెప్పినట్లు కుటుంబసభ్యులు వాపోయారు. బాధితుల ఫిర్యాదుతో సదరు అంబులెన్స్ డ్రైవర్‌ను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి ఆరోపణలు ఉన్న మరో ఇద్దరిని స్టేషన్‌కు పిలిపించి వార్నింగ్ ఇవ్వడంతో అంబులెన్స్ నిర్వాహకుల్లో కొంత భయం మొదలైంది.
కంట్రోల్ చేసేదెవరు...?
ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా వెలుగులోకి రావడం లేదు. అంబులెన్స్‌లను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్అధికారులు తమకేమీ సంబంధం లేదన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. అంబులెన్స్‌లు కండీషన్లో ఉన్నాయో లేదో ఆర్టీఏ అధికారులు పట్టించుకోవడం లేదు. కొవిడ్ టైమ్‌లో అప్పటి మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహజన్ అంబులెన్స్‌లపై కొరడా ఝళిపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అంబులెన్స్ దోపిడీని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
అంబులెన్స్‌లు నిర్వాహకులు రూల్స్ ప్రకారం నడుచుకోవాలి. కమీషన్లకు ఆశపడి పేషెంట్ల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు. అంబులెన్స్‌ల దోపిడీపై బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇటీవల సింధూజ మృతిపై వారి కుటుంబ సభ్యులు కంప్లయింట్ చేయడంతో బాధ్యుడైన సాగర్‌ను అరెస్ట్ చేశాం. అంబులెన్స్‌లతో ఎలాంటి సమస్యలు వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. - ఆర్.ప్రకాశ్, మంచిర్యాల ఏసీపీ