మసకబారుతున్న చూపు.. విద్యార్థుల్లో పెరుగుతున్న కంటి సమస్యలు

మసకబారుతున్న చూపు.. విద్యార్థుల్లో పెరుగుతున్న కంటి సమస్యలు
  • ఆర్​బీఎస్​కే ఆధ్వర్యంలో పరీక్షలు
  • అవసరమైన వారికి అద్దాలు, ఆపరేషన్లు
  • ఈ నెల 17 నుంచి మార్చి 5 వరకు స్పెషల్​ క్యాంపులు

మంచిర్యాల, వెలుగు: హైస్కూల్​విద్యార్థుల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయి. చాలామందికి చిన్నతనంలోనే చూపు మసకబారుతోంది. చదవడం, రాయడం ఇబ్బందవుతోంది. ఇది ఆందోళనకరమైన పరిణామమని డాక్టర్లు పేర్కొంటున్నారు. బాల్య దశలోనే పిల్లల్లో అంధత్వ నివారణ చర్యలు చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్​బీఎస్​కే) ద్వారా గవర్నమెంట్​ స్కూళ్లలోని పిల్లలకు ఏడాదికి రెండుసార్లు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో చాలా మంది చిన్నారులు దృష్టి లోపంతో బాధపడుతున్నట్టు తేలింది. వందలాది మందికి కంటి సమస్యలు బయటపడుతున్నాయి. 

జిల్లాలో 1,274 మంది

జిల్లాలో మొదటి విడతలో నిరుడు ఏప్రిల్​లో 164 రెసిడెన్షియల్​ స్కూళ్లలోని 11,949 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. ఇందులో 449 మందిలో కంటి సమస్యలను గుర్తించారు. రెండో విడత ఆగస్టులో 568 గవర్నమెంట్ ​స్కూళ్లలోని 24 వేల మంది స్టూడెంట్లకు టెస్టులు చేశారు. వీరిలో 694 మందికి కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు తేలింది. 

జీజీహెచ్​లో స్పెషల్​ క్యాంపు

కంటి సమస్యలు, దృష్టి లోపంతో బాధపడుతున్న విద్యార్థులకు అద్దాలు పంపిణీ చేయడం, అవసరమైన వారికి ఆపరేషన్లు చేయడానికి ఈ నెల 17 నుంచి మార్చి 5 వరకు స్పెషల్​ క్యాంపులు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల గవర్నమెంట్​జనరల్​హాస్పిటల్​లో ఏర్పాటు చేసిన క్యాంపును డీఎంహెచ్​వో హరీశ్​రాజ్, సూపరింటెండెంట్ ​హరీశ్​ చంద్రారెడ్డి, నోడల్ ఆఫీసర్​ అనిత సోమవారం ప్రారంభించారు. జిల్లా ఆఫ్తాల్మిక్​ఆఫీసర్ శంకర్, జిల్లా కంటి వైద్యాధి కారి యశ్వంత్​రావు ఆధ్వర్యంలో ఐ స్పెషలిస్టులు సరిత, చంద్రభాన్, శిల్ప విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.  

ALSO READ : ఫిబ్రవరిలోనే అడుగంటుతున్న భూగర్భ జలాలు

చిన్నారులకు అద్దాలు, ఆపరేషన్లు

స్పెషల్ క్యాంపులో రోజుకు 80 నుంచి 100 మంది స్టూడెంట్లకు డాక్టర్లు కంటి పరీక్షలు చేస్తున్నారు. మొదటిరోజు 86 మందికి పరీక్షలు చేసి కండ్ల ద్దాలు అందజేశారు. తీవ్రమైన దృష్టి లోపం కలిగిన ఇద్దరు చిన్నారులను ఆపరేషన్ ​కోసం రెఫర్​ చేశారు. మార్చి 5 వరకు కొనసాగనున్న ఈ క్యాంపులో మొత్తం 1,274 మందికి టెస్టులు చేసి అద్దాలు ఇవ్వడంతో పాటు అవరమైన వారికి ఆపరేషన్లు చేయిస్తామని అధికారులు పేర్కొన్నారు.