పరికరాల్లేవ్​.. ప్రైవేట్​కు పొండి

  •               ఎస్సై అభ్యర్థులను తిప్పి పంపుతున్న వరంగల్​ రీజనల్​ కంటి ఆస్పత్రి అధికారులు
  •                 ప్రైవేట్​ ఆస్పత్రుల్లో కంటి పరీక్షలు

 

ఎస్సైలుగా ఎంపికైన అభ్యర్థులకు ప్రస్తుతం వైద్య పరీక్షలు చేస్తున్నారు. అందులో భాగంగా కంటి చూపునూ పరీక్షిస్తారు. ఆ టెస్టులను సర్కారు దవాఖానాల్లోనే చేయాల్సి ఉంటుంది. కానీ, వరంగల్​ జిల్లాలో దానికి భిన్నంగా ప్రైవేట్​ ఆస్పత్రిలో అభ్యర్థులకు టెస్టులు చేయిస్తున్నారు. జిల్లాలోని రీజనల్​ కంటి ఆస్పత్రిలో సరైన వసతులు, పరికరాలు లేవన్న కారణం చెప్పి ప్రైవేట్​ ఆస్పత్రులకు పంపిస్తున్నారు ఆ హాస్పిటల్​ అధికారులు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​కు శనివారం ఫిర్యాదులు అందాయి. మంత్రి పేషీ అధికారులు ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్​కు ఫోన్​ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య విద్య డైరెక్టర్​ డాక్టర్​ రమేశ్​ రెడ్డి కూడా ఆరా తీశారు. వసతులు లేకపోతే అధికారులకు చెప్పాలి గానీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దని మందలించినట్టు తెలుస్తోంది. ప్రైవేట్​ ఆస్పత్రిలో పరీక్షలు చేయించిన అభ్యర్థులందరినీ హైదరాబాద్​ సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి పంపించాల్సిందిగా రమేశ్​ రెడ్డి ఆదేశించారని సమాచారం.