
- పదేండ్ల కిందటితో పోలిస్తే ఇది రెట్టింపు
- ఇండియన్ స్టూడెంట్లకూ తప్పని తిరస్కరణ
- 2024 తొలి 9 నెలల్లో ఎఫ్-1 వీసాల్లో 38% తగ్గుదల
- కరోనా తర్వాత ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి
న్యూయార్క్: అమెరికా ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టగానే ఎఫ్1 వీసాల్లో కోత విధిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ.. అంతకుముందునుంచే విదేశీ విద్యార్థుల దరఖాస్తులను అగ్రరాజ్యం భారీగా తిరస్కరిస్తూ వస్తోందట. ముఖ్యంగా కరోనాతర్వాత స్టూడెంట్ వీసా దరఖాస్తుల తిరస్కరణ బాగా పెరిగిందని పలు నివేదికలు వెల్లడించాయి. కొంతకాలంగా విద్యార్థి వీసా దరఖాస్తుల్లో అమెరికా భారీగా కోతపెడ్తున్నది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఎఫ్ 1 కోసం విద్యార్థులు పెట్టుకున్న దరఖాస్తులలో ఏకంగా 41% అప్లికేషన్లు తిరస్కరించింది. దశాబ్దం క్రితంతో పోలిస్తే ఎఫ్1 వీసాల తిరస్కరణ దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. ఇక 2024 నవంబర్ తర్వాత ట్రంప్ పాలసీలు, పొలిటికల్ ఐడియాలజీలతో అమెరికాలో విద్యనభ్యసించేందుకు చాలామంది విద్యార్థులు ఇష్టపడడం లేదని కీస్టోన్ఎడ్యుకేషన్ గ్రూప్ సర్వేలో తేలింది. వివిధ దేశాలకు చెందిన 42 శాతం మంది విద్యార్థులు యూఎస్‌లో స్టడీకి విముఖత చూపినట్టు వెల్లడించింది.
ఇండియన్ స్టూడెంట్స్విషయానికి వస్తే..
గతేడాది డిసెంబరు 9 నాటి వరకు ఉన్న గణాంకాల ప్రకారం.. 2024 సంవత్సరం తొలి 9 నెలల్లో ఎఫ్-1 వీసాలు 38 శాతం తగ్గాయి. కరోనా తర్వాత ఈ స్థాయిలో ఎఫ్ 1 వీసాలు తగ్గడం ఇదే తొలిసారి. బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ నెలవారీ నివేదికల డేటా ప్రకారం.. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 64 వేల మంది ఇండియన్ స్టూడెంట్స్‌కు ఎఫ్-1 వీసాలను జారీ చేశారు. 2018 లో 42 వేల మంది ఇండియన్ స్టూడెంట్లకు స్టడీ వీసా దక్కగా.. 2022 లో 1.15 లక్షలకు, 2023 లో 1.31 లక్షల మంది విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం ఎఫ్1 వీసా మంజూరుచేసింది. అయితే, 2024లో ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది. కేవలం 86 వేల మందికి మాత్రమే భారతీయ విద్యార్థులకు వీసాలు మంజూరుచేసింది.
పదేండ్లలో భారీగా తగ్గుదల
యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ డేటా ప్రకారం.. 2014 ఆర్థిక సంవత్సరంలో వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు ఎఫ్1 వీసా కోసం పెట్టుకున్న దరఖాస్తులలో 5.95 లక్షల అప్లికేషన్లకు ఆమోదం లభించగా, 1.73 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 2023 నాటికి ఆమోదం పొందిన స్టూడెంట్ వీసాల సంఖ్య 4.45 లక్షలకు పడిపోయింది. 2.53 లక్షల అప్లికేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ ట్రెండ్ 2023–24 ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగింది. ఎఫ్-1 వీసాల కోసం 6.79 లక్షల దరఖాస్తులు రాగా.. ఇందులో 2.79 లక్షల (దాదాపు 41శాతం) దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. అంటే పదేండ్లలో తిరస్కరణకు గురైన అప్లికేషన్ల సంఖ్య రెట్టింపుగా ఉన్నది.