- అంగన్వాడీ కేంద్రాల్లో ఫేస్ అథెంటిఫికేషన్ దిశగా అడుగులు
- అర్హులకు మాత్రమే అందనున్న పోషకాహారం
మహబూబాబాద్, వెలుగు: గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారం పక్కదారి పట్టకుండా, నేరుగా లబ్ధిదారులకు చేరే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫేస్ అథెంటిఫికేషన్ అటెండెన్స్అమలును తప్పనిసరిగా చేయనున్నది. కేంద్ర ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన పోషణ్ అభియాన్ యాప్ నిర్వహణ సరిగా లేకపోవడంతో కొత్త విధానాన్ని అమలు చేయనున్నది.
టెక్నాలజీతో పారదర్శకత..
నూతన టెక్నాలజీని వినియోగించడం ద్వారా మరింత పారదర్శకత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ముందుగా ట్యాబ్‌లలో అంగన్వాడి కేంద్రాల వారీగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఫేస్ అథెంటిఫికేషన్ అటెండెన్స్ వివరాలను నమోదు చేయనున్నారు. ఈ మేరకు ఐసీడీఎస్ లోని అన్ని విభాగాల సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం ఫేస్ అథెంటిఫికేషన్ కోసం యాప్‌ను ఎలా ఆధునీకరించుకోవాలో శిక్షణ ఇస్తారు. తొలుత సీడీసీవోలు, సూపర్వైజర్లకు, రెండో విడతలో అంగన్వాడీ టీచర్లు, ఇతర సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు.
దీంతో పోషణ్ అభియాన్ ట్రాకర్ యాప్‌ను ఆధునీకరించి లబ్ధిదారుల ఫొటో, ఆధార్ వివరాలను పొందుపర్చనున్నారు. కాగా, పోషన్ అభియాణ్ యాప్‌లో టైం, చిల్డ్రెన్స్ అటెండెన్స్, లబ్ధిదారుల ఇండ్ల సందర్శన వంటివి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. కానీ, ఈ యాప్ నిర్వహణ సక్రమంగా లేదనే విమర్శలు వస్తుండడంతో, ప్రభుత్వం ఫేస్ అథెంటిఫికేషన్ అటెండెన్స్ ను తప్పనిసరి చేయనున్నది.
ఉమ్మడి జిల్లాలోని అంగన్ వాడీ కేంద్రాల వివరాలు
జిల్లా అంగన్వాడీ కేంద్రాలు పిల్లలు గర్భిణీలు బాలింతలు
వరంగల్ 919 50,423 6,128 6,432
హనుమకొండ 788 45,552 4,231 3,587
మహబూబాబాద్ 1,435 36,703 4,175 3,653
జనగామ 695 23,543 3,396 2,430
ములుగు 640 21,624 2,874 2,407
భూపాలపల్లి 644 24,478 2,553 2,431
ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు..
అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు తగిన చర్యలను చేపడతాం. ప్రస్తుతం పోషన్ అభియాన్యాప్లో పిల్లలు, గర్భిణీలు, బాలింతల వివరాలను నమోదు చేశాం. ఫేస్అథెంటిఫికేషన్అటెండెన్స్పై మార్గదర్శకాలు అందిన వెంటనే అమలుకు చర్యలు తీసుకుంటాం. - ధనమ్మ, సంక్షేమ అధికారి, మహబూబాబాద్ జిల్లా