బోధన్, వెలుగు: నిజాం షుగర్‌ఫ్యాక్టరీకి చెందిన కార్మికులు, రైతులు కాంగ్రెస్ పై ఉద్యమం చేపట్టాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ పిలుపునిచ్చారు. బోధన్పట్టణంలోని ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ గేటు ముందు రైతులు, కార్మికులతో గురువారం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తామని మరోసారి రైతులు, కార్మికులు, ప్రజలను మోసం చేసేందుకే సబ్‌కమిటీ పేరుతో ముందుకు వచ్చారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా కార్మికులు, రైతులు నామినేషన్లు వేయాలని సూచించారు. తెలంగాణ ఏర్పడకముందు ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఫ్యాక్టరీని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.
రైతులు, కార్మికులు ఉద్యమం చేపడితే బీజేపీ నుంచి సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు. షుగర్ ఫ్యాక్టరీలు మూసివేయడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మూతపడిన 66 ఫ్యాక్టరీలను బీజేపీ అధికారంలోకి రాగానే ప్రారంభించిందని గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం బోధన్ ఫ్యాక్టరీ నుంచి ఎడపల్లి వరకు రైతులు, కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి సుధాకర్‌చారి, టౌన్ ప్రెసిడెంట్ బాల్ రాజు, బోధన్మండల అధ్యక్షుడు ప్రవీణ్‌పటేల్, ఎడపల్లి మండల అధ్యక్షుడు ఇంద్రకరణ్, నియోజకవర్గ కన్వీనర్ శ్రీధర్ పాల్గొన్నారు.