ఒకేసారి 50 మంది మాట్లాడుకునే అవకాశం
జూమ్ కు సవాల్ విసురుతున్న గూగుల్, ఫేస్ బుక్
న్యూఢిల్లీ: కరోనా లాక్ డౌన్ తో సాఫ్ట్ వేర్ సంస్థలతోపాటు ప్రభుత్వాలూ జూమ్ లాంటి వీడియో కాలింగ్ యాప్ ను విరివిగా యూజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూమ్ కు పోటీగా టెక్ దిగ్గజం గూగుల్ మీట్ ను డెవలప్ చేసింది. ఒకే టైమ్ లో స్క్రీన్ పై 16 మంది మంది మాట్లాడుకునేలా మీట్ ను గూగుల్ రూపొందించింది. ఇప్పుడు జూమ్ కు పోటీగా వీడియో కాలింగ్ యాప్ ను విడుదల చేయడానికి మరో ప్రముఖ కంపెనీ ఫేస్ బుక్ బరిలో దిగింది. మెసెంజర్ రూమ్స్ పేరుతో కొత్త ఫీచర్ ను ఫేస్ బుక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మెసెంజర్ రూమ్ లో ఒకేసారి 50 మంది వీడియో కాల్ ద్వారా మాట్లాడుకోవచ్చు. నేటి నుంచే మెసెంజర్ రూమ్స్ సేవలు ప్రారంభమవనున్నాయి. అయితే అన్ని దేశాల్లో ఈ యాప్ అందుబాటులోకి వచ్చేందుకు మరికొన్ని రోజులు పట్టొచ్చు. రూమ్ లో ఎవర్ని యాడ్ చేయాలనే దాని పై రూం క్రియేటర్ కు పూర్తి కంట్రోల్ ఉంటుంది. అలాగే అందరికీ రూం ఓపెన్ గా ఉండాలా లేదా అనేదీ రూం కంట్రోలర్ నిర్ణయిస్తారు. మెసెంజర్ లేదా ఫేస్ బుక్ నుంచి కూడా యూజర్లు కాల్స్ చేసుకోవచ్చు. ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ ల్లో ఈ ఫీచర్ ను అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఫేస్ బుక్ సంస్థ తెలిపింది. ఎఫ్బీ అకౌంట్ లేకున్నా మెసెంజర్ రూమ్స్ లో యూజర్లను యాడ్ చేయొచ్చని పేర్కొంది. యూజర్ల ప్రైవసీ, సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని రూమ్స్ ను రూపొందించామని వివరించింది. కాగా, వీడియో కాలింగ్ లో దూసుకుపోతున్న చైనాకు చెందిన జూమ్ యాప్ తో యూజర్ల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కేంద్రం తాజాగా హెచ్చరించిన విషయం తెలిసిందే.