
మీకు ఫేస్ బుక్‌లో అకౌంట్ ఉందా? అయితే, ఫోన్ నెంబర్‌తో సహా మీ వివరాలన్నీ ఇప్పుడు అమెజాన్ కంపెనీ చేతిలో ఉండవచ్చు! ఎందుకంటే.. ఫేస్ బుక్ యూజర్ల డేటాను ఆ కంపెనీ అమెజాన్‌కు రివార్డ్‌గా ఇస్తోందని ఓ కోర్టు కేసులోని పత్రాల ద్వారా వెల్లడైంది. ఫేస్బుక్ ఓనర్ మార్క్ జుకర్‌బర్గ్, ఆయన టీం యూజర్ల డేటాను దుర్వినియోగం చేస్తున్నారని, పార్ట్నర్ కంపెనీలకు ఆ డేటాను రివార్డులుగా ఇస్తున్నారంటూ 2011లోనే కాలిఫోర్నియాలోని ఓ కోర్టులో సివిల్ లా సూట్ దాఖలైంది. ఈ కేసుకు సంబంధించిన 7 వేల పేజీల డాక్యుమెంట్లు ఇటీవల లీక్ అయ్యాయి. అసలు విషయం వెలుగు చూసింది. ఫేస్బుక్లో ప్రకటనల కోసం డబ్బును ఖర్చు చేసినందుకు ప్రతిఫలంగా అమెజాన్‌కు స్పెషల్ డేటా యాక్సెస్ ను జుకర్ బర్గ్ టీం ఇచ్చిందని, మెసేజ్ మీ అనే తమ యాప్ పోటీగా మారడంతో దానికి డేటా యాక్సెస్‌ను నిరాకరించిందని ‘సిక్స్4త్రీ’ అనే స్టార్టప్ కంపెనీ ఈ లా సూట్‌ను ఫైల్ చేసింది.