చైనాలోని వుహాన్ సిటీలో పుట్టి వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అంతకంటే స్పీడ్‌గా ఈ వైరస్ గురించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రూమర్స్ జనాన్ని మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. జబ్బు కన్నా ముందు కరోనా కారణంగా అక్కడోదే జరిగింది.. ఇక్కడ ఇంకేదో జరిగిందంటూ ప్రచారమవుతున్న ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో టెన్షన్ పెంచుతోంది.
ఫేస్‌బుక్, గూగుల్, యూట్యూబ్…
ఈ రూమర్స్‌కు బ్రేక్ వేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇప్పుడు తాజాగా దిగ్గజ టెక్నాలజీ సంస్థలు నేరుగా రంగంలోకి దిగాయి. కరోనా వైరస్ గురించి తప్పుడు సమాచారం ప్రజల్లోకి పోకుండా అడ్డుకట్ట వేసేందుకు ఉమ్మడి పోరాడుతామని ఫేస్‌బుక్, ఆల్ఫాబెట్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, రెడిట్ సంస్థలు ప్రకటించాయి. వైరస్ గురించి కచ్చితమైన సమాచారం అందించేందుకు ఓ టీమ్‌గా ఏర్పడి కృషి చేస్తామని ఉమ్మడి ప్రకటన చేశాయి.
‘సోషల్ మీడియా ద్వారా జనం దూరంగా ఉన్న తమ వారి మంచి చెడు తెలుసుకునేందుకు లక్షలాది మందికి సాయం చేస్తున్నాం. ఒకరినొకరు కనెక్టెడ్‌గా ఉంచుతూనే తప్పుడు సమాచారం సర్క్యులేట్ అవ్వకుండా చేసేందుకు ఉమ్మడి పోరు చేస్తాం. సరైన సమాచారం అందించేందుకు ఆయా దేశాల హెల్త్ కేర్ ఏజెన్సీలతో సంప్రదిస్తూ అప్‌డేట్స్ ఇస్తున్నాం’ అని ప్రకంటించాయి ఆ కంపెనీలు.
మైక్రోసాఫ్ట్‌కు చెందిన లింక్డిన్, గూగుల్‌కు చెందిన యూట్యూబ్ కూడా తమతో కలిసి పని చేస్తాయని ఫేస్‌బుక్, ఆల్ఫాబెట్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, రెడిట్ కంపెనీలు వెల్లడించాయి.