- ఫేస్‌బుక్‌లో తప్పులపై నోరు విప్పిన మాజీ ఉద్యోగి
- ఇన్నాళ్లు సీక్రెట్‌గా ఉన్న ఆమె తెరపైకి వచ్చి ఇంటర్వ్యూ
- కొద్ది గంటలకే వాట్సాప్, ఫేస్‌బుక్ బంద్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సర్వీసులు నిన్న (సోమవారం) రాత్రి దాదాపు ఆరేడు గంటల పాటూ నిలిచిపోయాయి. ఫేస్‌బుక్‌తో పాటు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మూగబోయాయి. అయితే దీనికి కొద్ది గంటల ముందే గతంలో ఆ ఫేస్‌బుక్‌లో పని చేసిన మాజీ ఉద్యోగిని నోరు విప్పి కొన్ని సంచలన నిజాలను బయటపెట్టింది. ఫేస్‌బుక్‌లో ఇంటర్నల్‌గా జరుగుతున్న విషయాలను బయటపెట్టింది. గతంలోనే కొన్ని డాక్యుమెంట్లును అమెరికా పార్లమెంట్ (కాంగ్రెస్)కు, సెక్యూరిటీస్ ఎక్సేంజ్ కమిషన్‌కు, వాల్ స్ట్రీట్ జర్నల్‌కు అందించింది. ప్రజల పక్షాన పోరాడే విజిల్ బ్లోయర్లకు అందించే రక్షణ కల్పించాలంటూ ఫెడరల్ విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్‌కు దరఖాస్తు చేసుకున్న ఆమె నిన్న సడన్‌గా తెరపైకి వచ్చి తన ఐడెంటిటీని బయటపెట్టుకుని ఓ సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆమె పేరు ఫ్రాన్సిస్ హ్యూగెన్ (37).. ఇప్పడు ఆమె మాట్లాడిన విషయాలకు, ఫేస్‌బుక్ సర్వీసులు నిలిచిపోవడానికి ఏదైనా సంబంధం ఉందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఆమె ఏం మాట్లాడింది?
ఫేస్‌బుక్‌లో జరుగుతున్న విషయాలను బయటపెడుతూ అమెరికా పార్లమెంట్ ఎదుట సైతం కొన్ని డాక్యుమెంట్లను ఉంచిన ఫ్రాన్సిస్ హ్యూగెన్.. తొలిసారి నిన్న ఐడెంటిటీని బయటపెట్టుకుంది. ఫేస్‌బుక్ సేఫ్టీ కంటే సంపాదనకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందంటూ ఆ సంస్థలో జరుగుతున్న తప్పులను చెప్పుకొచ్చింది. ‘‘ఒక వేళ ఫేస్‌బుక్ సేఫ్టీకి ప్రాధాన్యమిస్తూ అల్గరిథమ్‌ను మార్చుకుంటే వినియోగదారులు తక్కువ టైమ్ మాత్రమే ఫేస్‌బుక్‌లో గడుపుతారు. యాడ్స్ కూడా తక్కువగా కనిపిస్తాయి. ఇది జరిగితే ఫేస్‌బుక్‌కు వచ్చే ఆదాయం తగ్గుతుంది” అని ఫ్రాన్సిస్ తెలిపింది. ఫేస్‌బుక్‌కు ముందు తాను చాలా సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో పని చేశానని, అన్నింటి కంటే ఇక్కడ పరిస్థితులు చాలా దరిద్రంగా ఉన్నాయని చెప్పింది.
టీనేజర్స్‌కు డేంజర్
ఫేస్‌బుక్ కంపెనీకి చెందిన ఇన్‌స్టాగ్రామ్ గురించి ఫ్రాన్సిస్ సంచలన విషయాలు బయటపెట్టింది. ఇన్‌స్టా వల్ల పిల్లలు, టీనేజర్స్ మానసిక ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని, ఆ వ్యక్తి వీక్‌గా ఉండే కొన్ని విషయాలకు అడిక్ట్ అయిపోయేలా దీని అల్గరిథమ్ ఉందని తెలిపిందామె. ‘‘మనిషి సహజంగా ఏదైనా చూస్తుంటే కొత్త టాపిక్‌కు వెళ్లాలనుకుంటాడు, కానీ ఫేస్‌బుక్ కంపెనీ అల్గరిథమ్ అలా వెళ్లనివ్వదు. ఇది టీనేజర్లకు ప్రమాదం. టీనేజ్ అమ్మాయిలకు ఈటింగ్ డిజార్డర్స్ రావడం, భారీగా బరువు పెరిగిపోవడం లేదా సడన్‌గా తగ్గిపోవడం లాంటివి జరగడానికి ఈ అల్గరిథమ్ వల్ల వచ్చే అడిక్షనే కారణం. ఫేస్‌బుక్ ఒక్క టీనేజ్ అనే కాదు అందరినీ ప్రభావితం చేసి ప్రమాదంలో నెట్టే అల్గరిథమ్స్ వాడుతోందని ప్రపంచానికి తెలియజేయడమే నా ఉద్దేశం. ఈ అల్గరిథమ్‌ను మార్చే ఆలోచన కూడా ఆ కంపెనీకి లేదు. దానికి డబ్బే పరమావధి” ఫ్రాన్సిస్ తెలిపింది.
ఫేక్ సమాచారాన్ని మరింత ప్రమోట్ చేస్తోంది
ఫేస్‌బుక్ బయటకు చెప్పే వాటికి, ఇంటర్నల్‌గా చేస్తున్న పనులకు అసలు సంబంధం లేదని ఫ్రాన్సిస్ పేర్కొంది. ఎలక్షన్లలో ఓటర్లను ప్రభావితం చేసేలా తప్పుడు సమాచారం ఫేస్‌బుక్ ద్వారా సర్క్యులేట్ కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని గత ఏడాది ఫేస్‌బుక్ ప్రకటించిందని, కానీ ఫేస్‌బుక్ అల్గరిథమే ఆ రకమైన ఫేక్, ప్రమాదకరమైన సమాచారాలను మరింతగా ప్రమోట్ చేస్తోందన్నది వాస్తవమని ఆమె వెల్లడించింది. దీని కంట్రోల్ చేసేలా చర్యలు తీసుకోవడవంలో ఫేస్‌బుక్ ఫెయిల్ అయిందని చెప్పింది. వాస్తవానికి అలాంటి ఫేక్ కంటెంట్‌కు జనాలు ఎక్కువగా అట్రాక్ అవుతున్నార్న కారణంతో దీనిని ప్రమోట్ చేస్తోందని ఫ్రాన్సిస్ చెప్పుకొచ్చింది. విద్వేషపూరిత, కల్లోలం సృష్టించే వాటికే జనాలు త్వరగా రియాక్ట్ అవుతున్నాని ఫేస్‌బుక్ ఇంటర్నల్ రిసెర్చ్‌లో తేలిందని, అందుకే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని వీటిని ప్రమోట్ చేస్తోందని ఆమె వెల్లడించింది.
జుకర్‌బర్గ్ మంచోడే కానీ..
ఫేస్‌బుక్ చేస్తున్న తప్పుల గురించి వివరించిన ఫ్రాన్సిస్... ఆ కంపెనీ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ విషయంలో మాత్రం సానుభూతి చూపిస్తూ మాట్లాడింది. జుకర్ మంచోడే కానీ, తర్వాత పరిస్తితులు మార్చేసేయన్నట్టుగా చెప్పుకొచ్చింది. ఫేస్‌బుక్‌ను విద్వేషపూరిత కంటెంట్‌తో నింపే ఆలోచన అతడిలో లేదని, అయితే ఆ రకమైన సమాచారాన్ని పెట్టే ఆప్షన్స్ వదిలేయడంతోనే పరిస్థితులు దారుణంగా మారాయని చెప్పింది. ఆ తర్వాత ఈ కంటెంట్‌కు రీచ్ బాగా ఉండడంతో ఆపడం కష్టమైందని తెలిపింది.
ఈ లైవ్ ముగిసిన కొద్దిసేపటికే ఫేస్‌బుక్ బంద్
ఫ్రాన్సిస్ హ్యూగెన్ ఇంటర్వ్యూ లైవ్ ప్రసారం ముగిసిన కొద్ది గంటల్లోపే ఫేస్‌బుక్, దాని అనుబంధ సోషల్ నెట్‌వర్క్స్ అయిన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ అన్నీ బంద్ అయిపోయాయి. దాదాపు ఏడు గంటల పాటు నిన్న రాత్రి పని చేయకుండా నిలిచిపోయాయి. ఏదో పొరబాటు జరిగిందని, తమ టీమ్ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొంటూ ఫేస్‌బుక్ సంస్థ వెల్లడించింది. నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఆగిన సర్వీసులు తెల్లవారుజామున 4 గంటల మధ్య మళ్లీ మొదలయ్యాయి. అయితే దీనికీ, ఫ్రాన్సిస్ ఇంటర్వ్యూకు మధ్య ఏదైనా లింక్ ఉందా అన్న అనుమానాలు నడుస్తున్నాయి.