సెక్రటేరియెట్‌‌లో ఫేషియల్​ అటెండెన్స్​

సెక్రటేరియెట్‌‌లో ఫేషియల్​ అటెండెన్స్​

హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్‌‌లో శుక్రవారం నుంచి ఫేస్‌‌ రికగ్నిషన్‌‌ హాజరు ప్రక్రియ ప్రారంభం కానుంది.రెగ్యులర్, ఔట్‌‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులందరికీ ఈ పద్ధతిని అమలు చేయనున్నారు. సెక్రటేరియెట్‌‌లో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి ఏఎస్ఓలు, సెక్షన్‌‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌‌ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, జాయింట్‌‌ సెక్రటరీలు, అడిషనల్‌‌ సెక్రటరీల వరకు దాదాపు 2 వేల మంది వరకు పని చేస్తున్నారు.

ఐఏఎస్‌‌లు మినహా అందరికీ ఫేషియల్‌‌ రికగ్నిషన్‌‌ విధానాన్ని అమలు చేయనున్నారు. సెక్రటేరియెట్‌‌లోని ప్రతి ఫ్లోర్‌‌‌‌లో ఎంట్రీల వద్ద ఫేషియల్ రికగ్నిషన్  మిషన్ ఏర్పాటు చేశారు. ఉద్యోగుల సమయ పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్‌‌ ప్రక్రియను తీసుకొచ్చింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సెక్రటేరియెట్‌‌లో ఉద్యోగులు విధులకు హాజరవుతున్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌‌‌‌, కొండా సురేఖ, సీతక్క, దామోదర రాజనర్సింహ తమ పేషీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, డ్యూటీలకు ఆలస్యంగా వస్తున్న ఉద్యోగులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోఉద్యోగుల హాజరు కోసం ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని తీసుకువచ్చింది.