మణుగూరు, వెలుగు: మణుగూరు రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రైల్వే ఏరియా అధికారి రజనీష్ కుమార్ మీనా ను కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.85 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేసే కార్యక్రమంలో భాగంగా మణుగూరులో రైల్వే గూడ్స్ షెడ్ ను రజనీష్ కుమార్ మీనా తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దక్షిణ అయోధ్యగా పిలవబడుతున్న భద్రాద్రిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారని, వారికోసం పాండురంగాపురం నుంచి సారపాక వరకు రైల్వే మార్గం నిర్మించాలని కోరారు. రైల్వే స్టేషన్ ఆవరణలో ప్రయాణికులకు వెయిటింగ్ హాళ్లు నిర్మించడంతోపాటు రైల్వే క్వార్టర్స్ ను ఆధునికరించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు గణేశ్రెడ్డి, ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరరావు, చందా సంతోష్, కాటబోయిన నాగేశ్వరరావు, పీరినాకి నవీన్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫోర్స్ గిరియా, చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జేమ్స్ పాల్, సీనియర్ సెక్షన్ ఇంజినీర్స్ ప్రసాద్, రవన్న, జోక్యం శిరీష, దండు రాణి పాల్గొన్నారు.