నాకు శత్రువులున్నారు..రక్షణ కల్పించండి: గద్దర్

  • డీసీపీ సీతారాంను కలిసిన గద్దర్
  • భూముల రక్షణ కోసం పోరాడుతుంటే శత్రువులు తయారయ్యారు: గద్దర్

జనగామ జిల్లా: తనకు శత్రువులు అధికంగా ఉన్నారని.. పోలీసులు రక్షణ కల్పించాలని ప్రజా గాయకుడు గద్దర్  కోరారు. తాను ఎక్కడికి వెళ్లినా శత్రువులు వెంటాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ జనగామకు వచ్చిన ప్రజాగాయకుడు గద్దర్ డీసీపీ సీతారాంను కలిసి తనకు రక్షణ కల్పించాలని వినతిపత్రం ఇచ్చారు. 

రఘునాథపల్లి మండల గూడెం వద్ద భగవాన్ బాలసాయి ట్రస్ట్ భూముల రక్షణ కోసం తాను పోరాటం చేస్తున్నందున తనకు శత్రువులు తయారయ్యారని చెప్పారు. ఈ భూముల్లో సాహిత్య, సాంస్కృతిక విశ్వవిద్యాలయం కట్టాలని రెండేళ్ల క్రితం లెటర్ పెట్టా.. 58 ఎకరాల భూమి కోసం పోరాడుతున్నప్పటి నుంచి తనకు శత్రువులు తయారయ్యారని గద్దర్ తెలిపారు. ఈ భూములు ప్రస్తుతం అన్యాక్రాంతమైనట్లు అనుమానం ఉందని... పోలీసులు సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలన్నారు.  శత్రువులు తనకు హాని తలపెట్టే ప్రమాదం ఉన్నందున తనకు  రక్షణ కల్పించాలని డీసీపీ సీతారాంకు గద్దర్ విజ్ఞప్తి చేశారు.