అవునా.. నిజమా!: బంగ్లాదేశ్ నిరసనల్లో విరాట్ కోహ్లీ.. నెత్తిన RCB టోపీ!

అవునా.. నిజమా!: బంగ్లాదేశ్ నిరసనల్లో విరాట్ కోహ్లీ.. నెత్తిన RCB టోపీ!

రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. ఏకంగా దేశ ప్రధాని షేక్‌ హసీనా పదవి నుంచి వైదొలిగి దేశం విడిచిపెట్టి వెళ్లినప్పటికీ, నిరసనకారులు శాంతించడం లేదు. ప్రభుత్వ భవనాలు, అవామీ లీగ్ పార్టీ నేతలకు చెందిన ఇళ్లకు నిప్పు పెడుతున్నారు. ఈ క్రమంలో అందినకాడికి విలువైన వస్తువులను దోచుకుంటున్నారు. ఇలాంటి హింసాత్మక నిరసనల్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పాల్గొన్నట్టు ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

దేశంలోని రాజకీయ అశాంతి మధ్య బంగ్లాదేశ్‌లో నిరసనలు తెలుపుతున్న ఆందోళనకారుల నడుమ భారత లెజెండరీ క్రికెటర్ విరాట్ కోహ్లి అన్న వీడియో తెగ వైరల్ అవుతోంది. అతనెవరో కానీ, అచ్చం కోహ్లీలానే ఉన్నాడు. బంగ్లా ప్రధాని షేక్ హసీనా తన రాజీనామా అనంతరం భారత్ చేరుకున్న కొన్ని గంటల తర్వాత ఈ దృశ్యం బయటకు వచ్చింది. వైరల్ అవుతోన్న వీడియోలో కోహ్లి డూప్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) క్యాప్ ధరించి, ఆందోళనకారులతో కలిసి నినాదాలు చేస్తూ కనిపించాడు. అతన్ని తోటి నిరసనకారులు తమ భుజాలపై మోస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

శ్రీలంకలో కోహ్లీ 

బంగ్లాదేశ్ నిరసనల్లో కోహ్లీ పాల్గొన్నారనేది పూర్తిగా అవాస్తవం. అది అతని డూప్. నిరసనకారులు కావాలని పనిగట్టుకొని చేసిన ప్రచారం. కోహ్లీలా కనిపిస్తే, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించవచ్చని చేసిన ప్రయత్నమని చెప్పుకోవాలి. 

నిజానికి కోహ్లీ శ్రీలంకలో ఉన్నాడు. భారత జట్టు ఆతిథ్య లంకేయులతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తవ్వగా.. ఈ ఇరు జట్ల మధ్య బుధవారం(ఆగష్టు 07) ఆఖరి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ జట్టు సభ్యులతో పాటే ఉన్నాడు.