ఇయ్యాళ భద్రాచలంలో రౌండ్ టేబుల్ మీటింగ్​

భద్రాచలం, వెలుగు: పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో ‘‘భూహక్కుల పరిరక్షణ ఉద్యమకారుల సమాఖ్య” ప్రతినిధులు శుక్ర, శనివారాల్లో పర్యటించారు. పోలవరం, కూనవరం, బూరుగుంపాడు, వరరామచంద్రాపురం మండలాల్లో  ఆదివాసులను కలిసి పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడం వల్ల ముంచుకొస్తున్న వరద ముంపు ప్రమాదం అడిగి తెలుసుకున్నారు.   280 ఆదివా సీ గూడేలలో రెండున్నర లక్షల మంది నిలువనీడ లేక  కన్నతల్లి లాంటి అడవికి దూరమవుతున్నామని, తమకు పునరావాసాన్ని కల్పించే అంశాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని ఆదివాసులు వాపోయారు.

పోలవరం ఎత్తు ఇంకా పెంచకముందే భద్రాచలంలోని అనేక పల్లపు ప్రాంతాలతో పాటు పర్ణశాల, ఆంజనేయస్వామి దేవాలయం, నవగ్రహాల ఆలయం,  కల్యాణ కట్ట వర్షాకాలం వరదలకు మునిగిపోయినా  కేంద్రప్రభుత్వం కనీసం స్పందించడం లేదని ఎటపాక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.  పర్యటనలో  సమాఖ్య నిజనిర్ధారణ సంఘం సభ్యులు సుప్రీం కోర్టు సీనియర్  న్యాయవాది  పి.నిరూప్,  సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి,  తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ దేశాయి, మట్టిమనిషి  వేనేపల్లి పాండురంగారావు,  విద్యార్థి నేతలు రాజేంద్రప్రసాద్, బండి కిరణ్ కుమార్ పాల్గొన్నారు.  పోలవరం ప్రాజెక్ట్  వల్ల తలెత్తుతున్న సమస్యలను చర్చించడానికి  23న భద్రాచలం వీరభద్ర ఫంక్షన్ హాల్లో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి భారీ సంఖ్యలో ప్రజలు రావాలని సమాఖ్య పిలుపునిచ్చింది.