గద్వాల కాంగ్రెస్ లో కొత్త, పాత వర్గాలు కలిసేనా?

గద్వాల కాంగ్రెస్ లో కొత్త, పాత వర్గాలు కలిసేనా?
  • ఉప్పు, నిప్పుగానే మాజీ జడ్పీ చైర్​పర్సన్, ఎమ్మెల్యే వర్గాలు
  • మినిస్టర్లు పర్యటించినప్పుడల్లా వివాదాలే
  • అయోమయంలో క్యాడర్

గద్వాల, వెలుగు: గద్వాల కాంగ్రెస్  పార్టీలో కొత్త, పాత వర్గాల మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. పాత, కొత్త నేతలు కలవకపోవడంతో ఎవరి వైపు వెళ్లాలో తెలియక క్యాడర్  అయోమయానికి గురవుతోంది. గద్వాల నియోజకవర్గంలో మినిస్టర్లు పర్యటించినప్పుడల్లా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది ఆగస్టు 17న మంత్రి జూపల్లి కృష్ణారావు నెట్టెంపాడు లిఫ్ట్​ను పరిశీలించేందుకు ఎమ్మెల్యే ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి పర్యటనకు బయలుదేరగా.. సరిత ఇంటికి రాకుండా ఎలా వెళ్తారంటూ ఆమె వర్గం మంత్రిని అడ్డుకుంది. 

అలాగే మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి గట్టు లిఫ్ట్ ను  పరిశీలించేందుకు వెళ్లగా రెండు వర్గాల నేతలు పోటీపడ్డారు. తాజాగా శుక్రవారం అమృత్ 2.0 స్కీం ప్రారంభోత్సవంలో కూడా రెండు వర్గాల మధ్య వివాదం జరిగింది. మినిస్టర్  జూపల్లి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించి స్టేజి పైకి వచ్చాక, మాజీ జడ్పీ చైర్​పర్సన్ ను పిలవలేదంటూ ఆమె వర్గం మినిస్టర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వెళ్లిపోయారు. నామినేటెడ్  పదవుల విషయంలోనూ రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. ఇలా అన్ని కార్యక్రమాల్లో వర్గ పోరు ఉండడంతో లా అండ్  ఆర్డర్  ప్రాబ్లంతో ఆఫీసర్లకు ఇబ్బందిగా మారింది. మినిస్టర్  పర్యటనను సవ్యంగా నిర్వహించేందుకు శుక్రవారం ఏకంగా మూడు జిల్లాల నుంచి ప్రత్యేక పోలీసులను పిలిపించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

గతంలోనూ ఇదే పరిస్థితి..

సరితకు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి గతం నుంచి కూడా పొసగడం లేదు. గతంలో ఇద్దరు బీఆర్ఎస్ లోనే ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక, లోకల్​బాడీ ఎలక్షన్స్​ వచ్చాయి. జడ్పీటీసీగా గెలుపొందిన సరిత ఆ తరువాత జడ్పీ చైర్​పర్సన్ గా ఎన్నికయ్యారు. ఆమె ఎన్నికైనప్పటి నుంచి వారిద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ.. గద్వాల నియోజకవర్గంలోని జడ్పీటీసీలు జడ్పీలో ప్రతిపక్ష పాత్ర పోషించారు. ప్రతి విషయంలో అడ్డు తగులుతూ వచ్చారు. ఐదేండ్లు వివాదాలతోనే ముగిసింది.

 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్  నుంచి పోటీ చేసి ఓడిపోగా, కృష్ణమోహన్​రెడ్డి బీఆర్ఎస్  నుంచి పోటీ చేసి గెలిచారు. ఆరు నెలల తరువాత ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి రావడంతో మళ్లీ వీరిద్దరి మధ్య పోరు మొదలైంది. బీఆర్ఎస్ లో ఉప్పు, నిప్పుగా ఉన్న వీరిద్దరు, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉండగా అదే పరిస్థితి కొనసాగుతోంది.

వేర్వేరుగా కార్యక్రమాలు..

పార్టీ కార్యక్రమాలను రెండు వర్గాలు వేర్వేరుగా చేస్తూ వస్తున్నాయి. రుణమాఫీ పథకాన్ని ప్రారంభించడంతో ఎమ్మెల్యే ధరూర్ మండలం చింతరేవులలో క్షీరాభిషేకం చేయగా, మరుసటి రోజు గద్వాలలో మున్సిపల్  చైర్మన్  బీఎస్  కేశవ్  ఆధ్వర్యంలో సరిత ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించి సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అదే రోజు ఎమ్మెల్యే ధరూర్ లో ట్రాక్టర్  ర్యాలీ నిర్వహించి రైతు వేదికలో జరిగిన మీటింగ్ లో పాల్గొన్నారు. గద్వాల పట్టణంలోని పాత బస్టాండ్  దగ్గర కూరగాయల మార్కెట్ ను కలెక్టర్, ఎమ్మెల్యే రాగా.. సరిత వర్గమైన మున్సిపల్  చైర్మన్  రాకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. 

రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు కార్యక్రమాలు చేస్తుండడంతో గద్వాల నియోజకవర్గంలోని కాంగ్రెస్  క్యాడర్ లో ఇబ్బంది పడుతోంది. పదేళ్లుగా అధికారం లేకపోయినా కాంగ్రెస్  జెండా పట్టుకుని నిలబడ్డామని, మళ్లీ తమకు ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. హైకమాండ్​ ఇరువర్గాలకు నచ్చజెప్పి క్యాడర్ కు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుతున్నారు.

ఎమ్మెల్యే పార్టీ మారడంతో..

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో జడ్పీ చైర్​పర్సన్​ వర్గీయులు తమ మాట చెల్లుబాటు అవుతుందని భావించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కాంగ్రెస్​లో చేరడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇదిలాఉంటే నామినేటెడ్  పదవులు, ఇందిరమ్మ కమిటీలు, సంక్షేమ పథకాల కోసం ఇరువర్గాలు పోటీ పడుతున్నాయి.