- 173 పోస్టుల్లో 35 మందే రెగ్యులర్ స్టాఫ్
- కెమిస్ట్రీ, కామర్స్ పోస్టులన్నీ ఖాళీ
- గెస్ట్, కాంట్రాక్ట్ లెక్చరర్లను నియమిస్తలే ఇప్పటి వరకు పుస్తకాలు రాలే
- పాత స్టూడెంట్ల బుక్కులతో క్లాసులు చెబుతున్న ఫ్యాకల్టీ
మహబూబ్‌నగర్, వెలుగు : గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ ఫ్యాకల్టీ కరువయ్యారు. ప్రభుత్వం ఖాళీ పోస్టులకు సరిపడా స్టాఫ్‌ను తీసుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ యేడు కాలేజీలు స్టార్ట్ రెండున్నర నెలలు దాటినా కనీసం గెస్ట్, కాంట్రాక్ట్ లెక్చరర్లను కూడా నియమించడం లేదు. ప్రతి యేడూ ఇదే పరిస్థితి నెలకొంటోంది. టైమ్‌కు సిలబస్ పూర్తి కాకపోవడంతో దీని ప్రభావం ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్‌పై పడుతోంది. ఈ కారణంతోనే ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేకపోతున్నాయి.
సెకండ్ ఇయర్‌లో 5,524 మంది స్టూడెంట్లు
పాలమూరు జిల్లా కేంద్రంలో బాయ్స్, గర్ల్స్‌కు వేర్వేరుగా, ఎంవీఎస్, ఒక వొకేషనల్ కాలేజీ, భూత్పూర్, అడ్డాకుల, మిడ్జిల్, బాలానగర్, యన్మన్గండ్ల, కోయిల్‌కొండ, దేవరకద్ర, జడ్చర్లలో రెండు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కాలేజీల్లో సెండర్ ఇయర్ స్టూడెంట్లు 4,900మంది, ఒకేషనల్‌లో 624 మంది కలిపి మొత్తం 5,524 మంది చదువుకుంటున్నారు. ఇప్పటి వరకు ఫస్ట్ ఇయర్‌లో దాదాపు మూడు వేల మంది చేరారు. ఇంకా ఎన్రోల్మెంట్ జరుగుతోంది. ఈ 13 కాలేజీలకు సంబంధించి 173 పోస్టులు శాంక్షన్ ఉండగా, ఇందులో కేవలం 35 మందే రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు. సబ్జెక్టుల వారీగా ఇంగ్లీష్‌లో 24 పోస్టులు ఉండగా ఇద్దరు, తెలుగు 18 పోస్టులకు ఐదుగురు, హిందీ 12 పోస్టులకు ఆరుగురు, మ్యాథ్స్ 14 మందిలో ఆరుగురు. ఫిజిక్స్‌లో 16 మందిలో ముగ్గురు, బొటనీలో 14 పోస్టులకు ఇద్దరు, జువాలజీ 14 పోస్టులకు ఇద్దరు, ఫిజిక్స్‌లో 12లో ముగ్గురు, ఎకనామిక్స్ 14 పోస్టులకు నలుగురు, హిస్టరీ ఎనిమిది పోస్టులకు ఇద్దరే ఉన్నారు. కెమిస్ట్రీ15 పోస్టులు, కామర్స్ 12 పోస్టులకు ఒక్కరు కూడా రెగ్యులర్ స్టాఫ్ లేరు. ఒకేషనల్ కాలేజీలో కూడా ఇద్దరే రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు.
కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీతోనే క్లాసులు
జిల్లాలో 138 రెగ్యులర్ లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో సర్కారు కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లతోనే స్టూడెంట్లకు క్లాసులు చెప్పిస్తున్నారు. ప్రస్తుతం 13 కాలేజీల్లో 122 మంది కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. వీరిలో గెస్ట్ ఫ్యాకల్టీని ఈ ఏడాది ఇంకా నియమించలేదు. ఇటీవల గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకోవాలని ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చినా ఇంకా ప్రక్రియ పూర్తి కాలేదు. ఇప్పటి వరకు ఫైనాన్స్ అప్రూవల్ మాత్రమే అయ్యింది. కానీ, కమిషనర్ నుంచి ఆర్డర్స్ రావాల్సి ఉంది. అది కూడా పాత వారిని కంటిన్యూ చేయాలా? లేక కొత్త వారిని తీసుకోవాలా? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.
అకడమిక్ బుక్కులు ఇంకా రాలె
ఈ ఏడాది జూన్ 15 నుంచి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలను స్టార్ట్ చేశారు. ప్రతి ఏటా కాలేజ్ వైజ్‌గా ఇండెంట్ ప్రకారం హైదరాబాద్ నుంచి నేరుగా పుస్తకాలు వచ్చేవి. ఏటా జూలై మొదటి వారంలో వీటి పంపిణీ జరిగేది. కానీ ఈ ఏడాది సెప్టెంబరు వచ్చినా ఇంత వరకు పుస్తకాలు సప్లై చేయలేదు. దీంతో స్టూడెంట్లకు క్లాసులు చెప్పేందుకు ఫ్యాకల్టీ ఇబ్బందులు పడుతున్నారు. గత అకడమిక్ ఇయర్‌లో ఇంటర్ పూర్తి చేసుకున్న స్టూడెంట్ల పుస్తకాలు తీసుకొని స్టూడెంట్లకు క్లాసులు చెబుతున్నారు. స్టూడెంట్లు క్లాసులు వింటున్నా రివిజన్ చేసుకునే వీలులేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఓల్డ్ స్టూడెంట్స్ నుంచి తీసుకుంటుండగా.. ఇకొందరు అందుబాటులో ఉన్న స్టోర్ల నుంచి సెకండ్ హ్యాండ్ బుక్స్ కొంటున్నారు. కాగా, ప్రస్తుతం రెండు, మూడు సబ్జెక్టులకు సంబంధించిన సిలబర్ మారింది. వాటి క్లాసులు ఇంత వరకు స్టార్ట్ చేయలేదని తెలిసింది.