
- వెటర్నరీ వర్సిటీలో అధ్యాపకుల సంఘం నిరసన
గండిపేట, వెలుగు: వర్సిటీలో కుల వివక్షపూరిత బదిలీలను రద్దు చేసేంత వరకు తీవ్రంగా నిరసన తెలుపుతామని పీవీ నర్సింహారావు వెటర్నరీ వర్సిటీ అధ్యాపకుల సంఘం స్పష్టం చేసింది. ట్రాన్స్‌ఫర్స్ పాలసీని పక్కన పెడుతూ పారదర్శకత లేని కులవివక్ష పూరితమైన బదిలీలు చేశారని వారం రోజులుగా అధ్యాపకులు వీసీ, అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్తున్నారు. కానీ ఆయన అధ్యాపక సంఘాన్ని కలిసేందుకు ఇష్టపడక పోవడంతో గురువారం వీసీ చాంబర్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.
తమ సమస్య పరిష్కారానికి వెళ్లినా కనీసం కలిసే అవకాశం ఇవ్వడంలేదని, అధ్యాపకులను కూడా వర్సిటీలోనికి రానివ్వకుండా గేట్లు మూసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 3 గంటల పాటు నిరసన తెలిపిన తర్వాత వీసీ.. అధ్యాపక సంఘంతో చర్చలు జరిపారు. దీంతో ఏకీభవించని సంఘం తదుపరి కార్యాచరణకు సిద్ధమైంది. శుక్రవారం కాలేజీ గేటు నుంచి పీవీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి అసోసియేట్ డీన్ చాంబర్ వద్ద శాంతియుత నిరసన తెలుపుతామని ప్రకటించింది. దీనిపై వర్సిటీ గవర్నర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పశుసంవర్థక శాఖ, బోర్డు మెంబర్స్‌కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొంది.