ఇవాళ(డిసెంబర్ 5న) మహారాష్ట్ర సీఎంగా నే ఫడ్నవీస్ ప్రమాణం..

ఇవాళ(డిసెంబర్ 5న) మహారాష్ట్ర సీఎంగా నే ఫడ్నవీస్  ప్రమాణం..
  • హాజరుకానున్న ప్రధాని మోదీ, 19 రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలు 
  • బీజేపీ ఎల్పీ నేతగా ఫడ్నవీస్ ఏకగ్రీవంగా ఎన్నిక 
  • సీఎం కుర్చీపై పట్టువీడిన షిండే 
  • మూడోసారి సీఎం పదవి చేపట్టనున్న బీజేపీ నేత

ముంబై: మహారాష్ట్రలో కొత్త సర్కారు ఏర్పాటుపై పదకొండు రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర నూతన సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (54) గురువారం సాయంత్రం 5.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆపద్ధర్మ సీఎం, శివసేన చీఫ్ ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా, మరికొందరు కీలక నేతలు మంత్రులుగా ప్రమాణం చేస్తారని అధికార మహాయుతి కూటమి వర్గాలు బుధవారం వెల్లడించాయి. ముంబైలోని ఆజాద్ మైదాన్​లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఎన్డీయే కూటమిలోని కీలక నేతలు, 19 రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. కార్యక్రమానికి దాదాపు 2 వేల మంది వీవీఐపీలు అటెండ్ కానున్నారని, 40 వేల మంది కార్యకర్తలు తరలి వస్తారని కూటమి వర్గాలు తెలిపాయి. 

బీజేఎల్పీ నేతగా ఏకగ్రీవం.. 

మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉండగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి 230 సీట్లతో ఘన విజయం సాధించింది. కూటమిలోని బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41 సీట్లను గెలుచుకున్నాయి. అయితే, తానే సీఎంగా కొనసాగుతానంటూ శివసేన చీఫ్ షిండే పట్టుబట్టడంతో బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగి బుజ్జగించింది. చివరకు పదకొండు రోజుల తర్వాత షిండే పట్టు విడవడంతో ఫడ్నవీస్ కు లైన్ క్లియర్ అయింది. మంగళవారం షిండేను ఆయన అధికారిక నివాసంలో ఫడ్నవీస్ కలిశారు. సీఎంగా ఆయనకు మద్దతు ఇచ్చేందుకు షిండే ఓకే చెప్పారు. దీంతో బుధవారం ముందుగా విధాన్ భవన్ లో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. బీజేపీ సెంట్రల్ అబ్జర్వర్లు నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీల సమక్షంలో ఫడ్నవీస్ ను తమ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తర్వాత సీఎం పదవి కోసం బీజేపీ కోర్ కమిటీ మీటింగ్​లో ఫడ్నవీస్ పేరును ఖరారు చేశారు. అనంతరం ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ కలిసి మధ్యాహ్నం 3.30 గంటలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్​ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరగా.. గవర్నర్ అనుమతి ఇచ్చారు.    

నవ్వులు పూయించిన షిండే.. 

గవర్నర్ ను కలిసిన తర్వాత ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రెండున్నరేండ్ల కిందట ఫడ్నవీస్ తనను సీఎంగా ప్రపోజ్ చేశారని, ఇప్పుడు ఆయనను ఆయనను సీఎంగా తాను ప్రతిపాదిస్తున్నానని షిండే చెప్పారు. తాను డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తానని, షిండే సాయంత్రం నిర్ణయం ప్రకటిస్తారని అజిత్ పవార్ తెలిపారు. ఈ సందర్భంగా షిండే తన కామెంట్లతో నవ్వులు పూయించారు. 2019లో అజిత్ పవార్, ఫడ్నవీస్ తెల్లవారుజామున ప్రమాణం చేశారని.. కానీ సర్కారు 80 గంటల్లోనే కూలిపోయిందన్నారు. ఇప్పుడు సాయంత్రం ప్రమాణం చేసి, పూర్తికాలం పదవిలో కొనసాగాలని ఆశిస్తున్నానని సరదాగా వ్యాఖ్యానించారు. కాగా, మహాయుతి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాలని షిండేను కోరానని ఫడ్నవీస్ తెలిపారు. సీఎం పదవి అనేది కేవలం ఒక టెక్నికల్ అంశం మాత్రమేనని, పాలనలో కూటమి పార్టీలన్నీ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటాయన్నారు. 

ఫడ్నవీస్.. ఆధునిక ‘అభిమన్యుడు’! 

రాజకీయాల్లో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఓర్పుతో ఎదుర్కోవడంతోపాటు నెగ్గాల్సిన చోట నెగ్గి.. తగ్గాల్సిన చోట తగ్గి.. ఉన్నత స్థానానికి ఎదిగిన నేతగా ఫడ్నవీస్ నిలిచారు. ‘‘నేను సముద్రంలాంటి వాడిని. మళ్లీ తిరిగొస్తాను”అని 2019 లో కొద్ది రోజుల్లోనే సర్కారు కూలిపోయిన తర్వాత చెప్పిన ఆయన అనుకున్నట్టే తిరిగి సీఎం అవుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆయన తనను తాను ఆధునిక అభిమన్యుడిగా అభివర్ణించుకున్నాడు. ‘‘నేను ఆధునిక అభిమన్యుడిని. పద్మవ్యూహాన్ని ఛేదించడం, విజయం సాధించడం తెలిసిన వాడిని” అని చెప్పుకుని.. తాజాగా రాజకీయ పద్మవ్యూహంలో పైచేయి సాధించి చూపారు. దేవేంద్ర ఫడ్నవీస్ నాగపూర్ కు చెందిన మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో 1970లో జన్మించారు. 

ఆయన తల్లి సరిత గృహిణి కాగా, తండ్రి గంగాధర్ నాగపూర్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. బిజినెస్ మేనేజ్మెంట్ లో పీజీ వరకూ చదివిన ఆయన కాలేజీ రోజుల్లో ఏబీవీపీలో చేరి విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. 1992లో బీజేపీలో చేరి 22 ఏండ్లకే కార్పొరేటర్ అయ్యారు. ఆ తర్వాత పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ సీఎం స్థాయి వరకూ చేరుకున్నారు. ఫడ్నవీస్ 2014లో తొలిసారి 44 ఏండ్ల వయసులో సీఎంగా ప్రమాణం చేశారు. అప్పట్లో బీజేపీ, ఉమ్మడి శివసేన కూటమి సర్కారును నడిపింది. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం కుర్చీని రొటేషన్ పద్ధతిలో మార్చుకునేందుకు నిరాకరిస్తూ కూటమి నుంచి ఉద్ధవ్ థాక్రే బయటకు వచ్చారు. అజిత్​ పవార్​ వర్గం నేతలతో కలిసి ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేశారు. అయితే, ఆ ప్రభుత్వం 80 గంటల్లోనే కూలిపోయింది.