ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి దుమ్మురేపింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయం ఖరారు కావడంతో నెక్ట్స్ మహా సీఎం ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మహాయుతి కూటమిలోని బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ ( అజిత్) మూడు పార్టీలు సీఎం పోటీ రేసులో ఉన్నాయి.
దేవేంద్ర ఫడ్నవీస్, సీఎం ఏక్ నాథ్ షిండే, అజిత్ ముగ్గురు సీఎం పదవి విషయంలో ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో తదుపరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే దానిపై స్టేట్ పాలిటిక్స్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై బీజేపీ ఎమ్మె్ల్సీ దారేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాయుతి కూటమి విజయం స్పష్టం కావడంతో 2024, నవంబర్ 23న ఎమ్మె్ల్సీ ప్రవీణ్ దారేకర్ మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తోందని.. కూటమిలో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీకే ముఖ్యమంత్రి పదవి దక్కుతోందని స్పష్టం చేశారు.
నెక్ట్స్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అవుతారని నేను నమ్ముతున్నానని అన్నారు. ఆయన నేతృత్వంలోని మహాయుతి కూటమి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిందని.. ఎన్నికల ప్రచారంలో ధర్మయుద్ధంలో జిహాద్ ఓటర్లను ఓడించాలని ఆయన ఇచ్చిన పిలుపు ప్రజల్లోకి బాగా చేరువైందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ను రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా నియమించాలని ఈ సందర్భంగా దారేకర్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం బీజేపీ 125, శివసేన 57, ఎన్సీపీ 37 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది.