ఇంటర్​లో ఫెయిల్.. నలుగురు స్టూడెంట్స్​సూసైడ్

ఆర్మూర్/గద్వాల/ఎల్బీనగర్/వనపర్తి, వెలుగు : ఇంటర్మీడియెట్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన నలుగురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్ టౌన్ లోని శాస్త్రినగర్ కు చెందిన మొర ప్రజ్వల్ (16 )  హైదరాబాద్ మాదాపూర్ లోని కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ బైపీసీ చదువుతున్నాడు. మంగళవారం రిలీజ్​అయిన ఇంటర్ రిజల్ట్స్​లో  రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపానికి గురైన ప్రజ్వల్​ఇంట్లో పై అంతస్తులోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీ రు మున్నీరుగా విలపిస్తున్నారు. అలాగే, గద్వాల జిల్లా కేంద్రంలోని సెకండ్ రైల్వే గేట్ కాలనీలో నివాసముంటున్న కల్పన, లక్ష్మీకాంతరెడ్డి దంపతుల రెండో కొడుకు అమరేశ్వర్ రెడ్డి (17) సైతం  ఇంటర్ లో ఫెయిల్ కావడంతో మంగళవారం సాయంత్రం ఇంట్లోనే ఉరి వేసుకొన్నాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని గద్వాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు బోరున విలపించారు. 

అదే విధంగా, హైదరాబాద్​లోని సంతోష్ నగర్ కాలనీకి చెందిన జాహ్నవి (16) అనే ఇంటర్​ స్టూడెంట్​కూడా ఆత్మహత్యకు పాల్పడింది. జాహ్నవి స్థానికంగా ఇంటర్ ఫస్ట్  ఇయర్ చదువుతోంది. మంగళవారం రిలీజ్​చేసిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదు. దీంతో మనస్తాపంతో ఇంట్లో చున్నీతో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన నవీన(17) మహబూబ్ నగర్ లోని ఓ ప్రైవేట్​కాలేజీలో ఇంటర్​ ఫస్టియర్​ చదువుతోంది. మంగళవారం వచ్చిన రిజల్ట్స్ లో​మార్కులు తక్కువ వచ్చాయన్న కారణంతో ఇంట్లో ఉరేసుకొని సూసైడ్​ చేసుకుంది.