ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాఖలు చేసిన ఆర్టీఐల ద్వారా దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలు, ఐఐటీలు, ఐఐఎంలలో ఫ్యాకల్టీ ఖాళీలకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ గణాంకాలు భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ఫలాలు అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి అవకాశాలను అందించడంలో ఈ ఖాళీలు పెద్ద సవాళ్లుగా మారాయి.
ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రఖ్యాత విద్యాసంస్థల్లో రిజర్వేషన్ విధానం సామాజిక న్యాయం, సమాన అవకాశాలను కల్పించడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తోంది. ఈ విధానం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యా సంస్థలు విద్యావకాశాలు కల్పించేందుకు ప్రేరణగా నిలుస్తోంది. అయితే, ఈ విధానాల అమలులో అనేక అవాంతరాలు మరియు లోపాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
భా రత రాజ్యాంగం రిజర్వేషన్ నిబంధనలకు బలంగా మద్దతు ఇస్తుంది. ఆర్టికల్ 15(4),15(5), సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ప్రత్యేక నిబంధనలు చేయడానికి అధికారాన్ని కల్పిస్తాయి. అలాగే, ఆర్టికల్ 16(4), వెనుకబడిన తరగతుల కోసం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను నిర్ధారిస్తుంది. ఇది ఐఐటీలు, ఐఐఎంలు వంటి విద్యాసంస్థల్లో ఫ్యాకల్టీ నియామకాలకు కూడా వర్తిస్తుంది. కేంద్ర విద్యాసంస్థలు (ప్రవేశాల రిజర్వేషన్) చట్టం, 2006 ద్వారా ఎస్సీల కోసం 15%, ఎస్టీల కోసం 7.5%, ఓబీసీల కోసం 27% రిజర్వేషన్ అమలు చేయబడుతోంది.
2019లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10% రిజర్వేషన్ ప్రవేశపెట్టబడింది. ఈ రిజర్వేషన్ అమలుతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా విద్యావకాశాలు మరింత విస్తరించడమైంది. ఈ విధానాలు సామాజిక న్యాయాన్ని సాధించడంలో కీలకమైనవి. అయినప్పటికీ, రిజర్వేషన్ అమలులో ఉన్న లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దడం అత్యవసరం. ఖాళీలను భర్తీ చేయడంలో పారదర్శకత, నిబంధనల పర్యవేక్షణ ద్వారా మాత్రమే ఈ విధానాలు తమ పూర్తి ఉద్దేశ్యాన్ని సాధించగలవు.
ఐఐటీల, ఐఐఎం ఫ్యాకల్టీ ఖాళీల గణాంకాలు
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రాతినిధ్యంను పరిగణనలోకి తీసుకుంటే.. 13 ఐఐఎంలలో 5% ఎస్సీలు,1% ఎస్టీలు, 9.6% ఓబీసీలు మాత్రమే ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు. 21 ఐఐటీలలో 6% ఎస్సీలు, 1.6% ఎస్టీలు, 11.2% ఓబీసీలు మాత్రమే ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు. ఈ గణాంకాలు, రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయ హామీలను అమలు చేయడంలో విద్యా సంస్థలు విఫలమవుతున్నాయని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆర్టీఐ ద్వారా పొందిన వివరాల ప్రకారం, పదకొండు ఐఐటీల్లో మొత్తం 1,557 ఫ్యాకల్టీ ఖాళీలున్నాయి.
వీటిలో 415 ఓబీసీలకు, 234 ఎస్సీలకు, 129 ఎస్టీలకు రిజర్వ్ చేయడమైంది. ఈ గణాంకాలు, రిజర్వ్ చేసిన స్థానాలను భర్తీ చేయడంలో గల తీవ్రమైన లోపాలను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఏడు ఐఐఎంలలో మొత్తం 256 ఖాళీలు ఉన్నాయని వెల్లడైంది. ఇందులో 88 ఓబీసీలకు, 54 ఎస్సీలకు, 30 ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. అయితే, ఈ గణాంకాలు ప్రాతినిధ్యం లోపాన్ని, రిజర్వేషన్ అమలులో ఉన్న అసమానతలను స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. అగ్రవర్ణాలకు చెందినవారు, ఐఐఎం లక్నో, ఐఐఎం ఉదయపూర్ వంటి సంస్థల్లో 90% పైగా ఫ్యాకల్టీ స్థానాలను ఆక్రమించారు. ఐఐటీ బాంబే, ఐఐటీ ఖరగ్‌పూర్ వంటి అత్యున్నత సంస్థల్లో కూడా 90% పైగా ఫ్యాకల్టీ స్థానాలు జనరల్ కేటగిరీకి చెందినవారే.
సమాజంపై ప్రభావం
రిజర్వేషన్ నిబంధనల అమలులో ఉన్న లోపాలు తీవ్రమైన సామాజిక అన్యాయానికి దారితీస్తున్నాయి. ఈ లోపాలు అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి అవకాశాలను అందించడంలో అవరోధాలుగా మారుతున్నాయి. ఉన్నత విద్యావకాశాలు, రాజకీయ, సామాజిక స్థిరత్వం పొందడానికి అవి కీలకమైన సమయంలో, ఈ వర్గాలు అసమానతల కారణంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ లోపాలు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఉపాధి అవకాశాలు వంటి కీలక రంగాల్లో అణగారిన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లభించ కుండా చేస్తున్నాయి.
దీని ప్రభావం వలన, రాజ్యాంగంలోని సవరణలు కేవలం కాగితంపై మాత్రమే పరిమితం అవుతున్నాయని భావించవచ్చు. రిజర్వేషన్ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు కాగలిగితే సామాజిక న్యాయానికి న్యాయం జరుగుతుంది. కానీ, లోపాల కారణంగా ఈ హామీలు నిలబెట్టలేని స్థితికి వస్తున్నాయి. అమలులో పారదర్శకత, సమయానుకూలమైన చర్యలు, మరియు విధాన పర్యవేక్షణ వంటివి అత్యవసరమని ఈ పరిస్థితి స్పష్టంగా సూచిస్తోంది.
సమస్య పరిష్కారానికి సూచనలు
ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIOBCSA) వెలుగులోకి తీసుకొచ్చిన గణాంకాలు రిజర్వేషన్ నిబంధనల అమలులో తీవ్రమైన లోపాలను స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితి వెంటనే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్ల అమలును స్వతంత్ర కమిటీ కఠినంగా పర్యవేక్షించి, నియామక ప్రక్రియలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించే విధానాలను అమలు చేయాలి. రిజర్వేషన్ నిబంధనలను పాటించని సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించాలి.
ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ బోర్డులో సగం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సభ్యులు ఉండాలి. అర్హులైన SC, ST, OBC అభ్యర్థులు అందుబాటులో ఉంటే రిక్రూట్మెంట్ బోర్డు ఏ రిజర్వ్డ్ పోస్టును ఖాళీగా ఉంచకూడదు. ఐఐటీ పాట్నా, ఐఐఎం జమ్ము వంటి కొన్ని సంస్థలు రిజర్వేషన్ అమలులో ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ సంస్థలు, చిత్తశుద్ధి, కట్టుబాటు ఉంటే రిజర్వేషన్ అమలు సుసాధ్యం అని నిరూపిస్తున్నాయి. AIOBCSA వెలుగులోకి తీసుకొచ్చిన ఈ గణాంకాలు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, విద్యా సంస్థలు రాజ్యాంగ హామీలను నెరవేర్చేవిధంగా చొరవ చూపాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.