ఖమ్మం టౌన్, వెలుగు: భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు న్యాయం జరిగేలా పరిహారం అందించనున్నట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. విజయవాడ– -కాజీపేట రైల్వే మూడో లైన్ ప్రాజెక్ట్ కు సంబంధించి మధిర, బోనకల్ మండలాల్లో భూములు కోల్పోతున్న రైతులు, రైల్వే, రెవెన్యూ అధికారులతో ఖమ్మం కలెక్టరేట్ లో సంప్రదింపుల కమిటీ మీటింగ్ నిర్వహించారు. మధిర మండలం మడుపల్లి, దిగుడుపాడు,తొర్లపాడు గ్రామాల నుంచి 41 మంది, బోనకల్ మండలం రామాపురం, ముష్టికుంట్ల, చిరునోముల, బోనకల్, మోటమర్రి గ్రామాలకు చెందిన 88 మంది రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి వారి అంగీకారం మేరకు ఎకరాకు రూ.15 లక్షల చొప్పున చెల్లించేందుకు నిర్ణయించారు. పరిహారం వారం లోగా రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ కానున్నట్లు కలెక్టర్ చెప్పారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ఎన్.మధుసూధన్, ఆర్డీవో రవీంద్రనాథ్, సౌత్ సెంట్రల్(విజయవాడ) రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ సుధాకర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
సిరిపురం హెచ్ఎం రామారావు పై పోక్సో కేసు
వైరా, వెలుగు: విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన కేజీ సిరిపురం జడ్పీఎస్ఎస్ హెచ్ఎం సలాది రామారావు పై పోక్సో నమోదైంది. ఈనెల 22న హెచ్ఎం రామారావు స్కూల్లోని విద్యార్థినులతో అనుచిత ప్రవర్తించడంతో హెచ్ఎంను విద్యాశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయమై మధిర సీడీపీవో ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు ఎస్సై వీరప్రసాద్ తెలిపారు.
గంజాయి అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్
మణుగూరు, వెలుగు : మణుగూరు పట్టణంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు ఎస్సై రాజ్‌కుమార్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలో మంగళవారం రాత్రి వెహికిల్ చెకింగ్ చేస్తుండగా బత్తుల సాత్విక్, కె. మహేశ్అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారి వెహికిల్‌ను తనిఖీ చేశారు. వారి వద్ద 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏపీ నుంచి గంజాయి తీసుకువచ్చి మణుగూరులో అమ్ముతున్నట్లు ఎస్సై తెలిపారు. ఇద్దరిని కోర్టుకు రిమాండ్ చేశామన్నారు.
ప్రైవేటు హాస్పిటళ్లలో నార్మల్ డెలివరీలు పెంచాలి
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: జిల్లాలోని అన్ని ప్రైవేటు హాస్పిటళ్లలో నార్మల్ డెలివరీలను పెంచాలని డీఎంహెచ్‌వో మాలతి ప్రైవేటు హాస్పిటల్స్ మేనేజ్మెంట్లను ఆదేశించారు. బుధవారం డీఎంహెచ్ వో ఆఫీస్‌లో ప్రైవేటు హాస్పిటల్ మేనేజ్మెంట్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ బర్త్ పోర్టల్‌లో డెలివరీల నమోదు, హెచ్ఐపీ పోర్టల్‌లో ఫామ్ పీ, ఎల్లలో తప్పనిసరిగా వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కార్యక్రమంలో హాస్పిటల్ల వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది రెండో డోసు వేసుకుని 6నెలలు నిండిన వారందరూ ప్రికాషనరీ డోసు టీకా వేయించుకోవాలన్నారు. సమావేశంలో డిఫ్యూటీ డీఎంహెచ్‌వో రాంబాబు, పీవో ఎంసీహెచ్ సైదులు, పీవో డీటీటీ మోత్యా, నీలోహన, డెమో సాంబశివరెడ్డి, కృష్ణమోహన్ పాల్గొన్నారు.
హాస్టళ్లలో మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలి
ఖమ్మం టౌన్, వెలుగు: రాష్ట వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్స్ సమస్యలను పరిష్కరించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్టూడెంట్స్ కు మెస్, కాస్మోటిక్స్ చార్జీలు పెంచాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అజాద్, వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఖమ్మంలో బుధవారం పీడీఎస్‌యూ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి 8 ఏండ్లు అవుతున్నా సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం స్టూడెంట్స్‌కు ఇస్తున్న మెస్‌చార్జీలు సరిపోవడం లేదని, పౌష్టికాహారం అందకపోవడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారని ఆరోపించారు. మెస్, కాస్మొటిక్చార్జీలను పెంచాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో లీడర్లు సతీశ్, మురళి, కరణ్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ కు షాక్ అశ్వారావుపేటలో ముగ్గురు ఎంపీటీసీల రాజీనామా
అశ్వారావుపేట వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో టీఆర్ఎస్పార్టీకి షాక్ తగిలింది. టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు ఎంపీటీసీలు పార్టీ సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. వల్లెపు తిరుపతిరావు(గుమ్మడవల్లి), కంగాల రమేశ్(నారాయణపురం), పాయం కుమారి(బచ్చువారిగూడెం) తమ రాజీనామా పత్రాలను పార్టీ మండల అధ్యక్షుడు బండి పుల్లారావుకు అందచేశారు. పార్టీ ప్రారంభం నుంచి ఉన్న తమను కాదని, పార్టీలో సభ్యత్వమే లేని కొంతమంది నాయకుల పెత్తనం, పార్టీ కార్యక్రమాలపై సమాచారం లేకపోవడం, మొదటి నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తలకు న్యాయం చేయకపోవడం... వంటి కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఎంపీటీసీలు ప్రకటించారు. అభివృద్ధి పనుల విషయంలో తమకు గుర్తింపు ఇవ్వకపోగా, ఎమ్మెల్యే పర్యటన వివరాలను సైతం మండల నాయకత్వం తమకు చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బండి సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ నిరసన
మధిర, వెలుగు: బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్కుమార్అరెస్ట్ను నిరసిస్తూ మధిర లో బీజేపీ శ్రేణులు బుధవారం ఆందోళన చేపట్టాయి. బీజేపీ జిల్లా కార్యదర్శి చిలివేరు సాంబశివరావు మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కూతురు, ఎమ్మెల్సీ కవిత పాత్రపై బీజేపీ నాయకులు నిరసన తెలిపితే, తెరాస శ్రేణులు దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. బండి సంజయ్‌ను అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు కుంచం కృష్ణారావు, మధిర రూరల్ మండల ఇన్చార్జి నాగేశ్వరావు, బీజేవైఎం జిల్లా కార్యదర్శి నాగభూషణం,లీడర్లు నరసింహారావు, జీవీ నాగేంద్రబాబు పాల్గొన్నారు.
సత్తుపల్లి, వెలుగు: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ని అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఉడతనేని అప్పారావు పేర్కొన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బండి సంజయ్ అరెస్ట్ ను ఖండించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుదర్శన్ మిశ్రా, పట్టణ, మండల అధ్యక్షులు నాగస్వామి, శ్రీనివాస్, రహంతుల్లా, నరసింహ మూర్తి, వసంతరావు పాల్గొన్నారు.
భద్రాచలం, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్ట్, ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకుంటున్న టీఆర్ఎస్ శ్రేణుల తీరును వ్యతిరేకిస్తూ భద్రాచలంలో బీజేపీ లీడర్లు బుధవారం నల్లరిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. అంబేద్కర్ సెంటర్లో అల్లూరి సీతారామరాజు, మల్లుదొర, ఘంటం దొరల విగ్రహాల వద్ద ఆందోళన చేపట్టారు. నిరసన కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రామ్మోహన్రావు, నియోజకవర్గ కన్వీనర్ కుంజా ధర్మ, మండల ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన వెంకన్న, వెంకటేశ్వరరావు, సూరత్ సుదర్శన్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
దేశ సమగ్రతను బీజేపీ నాశనం చేస్తోంది
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: దేశ సమగ్రత, సంస్కృతులను బీజేపీ నాశనం చేస్తోందని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్పేర్కొన్నారు. బుధవారం ఖమ్మంలోని టీఆర్ఎస్ ఆఫీస్‌లో జడ్పీ చైర్మన్కమల్రాజు, డీసీసీబీ చైర్మన్కూరాకుల నాగభూషయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజులతో కలిసి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక సీఎం కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలకు బీజేపీ తెరలేపుతోందన్నారు. గుజరాత్ అల్లర్ల ఘటనపై జైలుకు వెళ్లిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. ప్రస్తుతం తెలంగాణకు వచ్చి కేసీఆర్ప్రభుత్వం, ఆయన కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. బండి సంజయ్‌కు మతిభ్రమించిందని, రాజాసింగ్ ఏదేదో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారన్నారు. తెల్ధారుపల్లిలో తమ్మినేని కృష్ణయ్య హత్య దురదృష్టకరమన్నారు. జడ్పీ చైర్మన్కమల్రాజు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీల నాయకులపై సీబీఐ, ఈడీలతో దాడులు చేయించి, వారిని పార్టీలో చేర్చుకోవడం బీజేపీకి పరిపాటిగా మారిందన్నారు.
పెద్దమ్మ తల్లి హుండీ ఆదాయం రూ.21 లక్షలు
పాల్వంచ, వెలుగు: కేశవాపురం–జగన్నాథపురంలో మధ్యలో గల పెద్దమ్మ తల్లి ఆలయ హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. 70 రోజులకు సంబంధించి రూ.21,92,733 అమ్మవారికి కానుకలుగా వచ్చాయి. వీటితోపాటు ఆరు విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయి. ఆలయ ఎండోమెంట్ ఆఫీసర్కె.సులోచన, డివిజనల్ పరిశీలకులు బేల్ సింగ్ పర్యవేక్షణలో హుండీ ఆదాయం లెక్కించారు. కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షుడు మహిపతి రామలింగం, సభ్యులు నాగరాజు, వెంగళరావు, ప్రవీణ్ కుమార్, చిన్న వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, మాలోత్ సువాలీ,
కె.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
‘పోలవరం’ ఉద్యమకారులపై కేసులు ఎత్తేయాలి
భద్రాచలం, వెలుగు: ‘పోలవరం’ ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ గోండ్వానా సంక్షేమ పరిషత్(జీఎస్పీ) ఆధ్వర్యంలో ఆదివాసీలు బుధవారం భద్రాచలం ఐటీడీఏ ఎదుట ధర్నా నిర్వహించారు. జీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ.. గిరిజన గ్రామాలను జలసమాధి చేసి, గిరిజనుల బతుకులను ఆగం చేస్తున్న పోలవరం ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేసిన ఆదివాసీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఐటీడీఏ ఏవో భీమ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆదివాసీ నేతలు పూనెం నాగేశ్వరరావు, ఇర్పా ప్రకాశ్, పాయం సన్యాసి, తుర్సం విజయ, చుక్కమ్మ, రాములమ్మ, బుచ్చయ్య పాల్గొన్నారు.
ప్రతి చోట సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని ప్రతి చోట సీసీ కెమెరాల ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ వినీత్పోలీస్ అధికారులకు సూచించారు. కొత్తగూడెంలోని ఎస్పీ ఆఫీస్‌లో బుధవారం పోలీస్ అధికారులతో నిర్వహించిన క్రైం రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన విధులను తప్పనిసరిగా పాటించేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. సీసీ కెమెరాల ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రతి చోట ఏర్పాటు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడితే బాధితులు టోల్ ఫ్రీ నెంబర్ 1930కు సమాచారం ఇవ్వాలన్నారు. మీటింగ్‌లో ఏఎస్పీ రోహిత్ రాజు, డీఎస్పీలు జి.వెంకటేశ్వరబాబు, రమణమూర్తి, సత్యనారాయణ, డీసీఆర్బీ డీఎస్పీ నందీరామ్, ఇన్స్పెక్టర్ఉపేందర్ పాల్గొన్నారు.