కురుమూర్తి జాతర సందడి

కురుమూర్తి జాతర సందడి
  • నేడు   సీఎం రేవంత్ రెడ్డి రాక 
  • రూ.110 కోట్లతో కురుమూర్తి ఘాట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం
  • ఏర్పాట్లను పరిశీలించిన జోగులాంబ డీఐజీ ఎల్ఎస్ చౌహన్, ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి 

చిన్నచింతకుంట, వెలుగు : కురుమూర్తి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగియడంతో శనివారం జాతర ప్రారంభమైంది. దాదాపు నెల రోజుల పాటు జాతర కొనసాగనుంది.   జాతరకు వారం రోజుల ముందు నుంచే వ్యాపారులు వివిధ రకాల దుకాణాలను కురుమూర్తి జాతర మైదానంలో ఏర్పాటు చేశారు. చిన్న పిల్లలు ఆడుకునే ఆట వస్తువుల, గాజులు, స్వీట్లు, స్టీల్ సామాన్ల దుకాణాలు వెలిశాయి. అలాగే జాతరలో ఫేమస్​గా  చెప్పుకునే మటన్ సీకుల దుకాణాల 50 వరకు వెలిశాయి.

రెండో శనివార  కావడంతో వందల కొద్దీ భక్తులు తరలి వచ్చారు. అయితే ఆదివారం సెలవు కావడం.. జాతర మొదటి రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. దీనికితోడు సీఎం వస్తుండటంతో దాదాపు లక్షల్లో జనం తరలి వచ్చే అవకాశం ఉండటంతో ఆ మేరకు ఏర్పాట్లు చేశారు.

నేడు సీఎం రాక

పేదల తిరుపతిగా వెలుగొందుతున్న మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ సమీపంలోని కురుమూర్తి క్షేత్రాన్ని సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన క్షేత్రానికి చేరుకొని కురుమూర్తి రాయుడు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ మేరకు ఆయన కురుమూర్తి టూర్ షెడ్యూల్ను ఆఫీసర్లు ఖరారు చేశారు. హైదరాబాద్ నుంచి ఉదయం పది గంటలకు సీఎం రోడ్డు మార్గాన కురుమూర్తికి బయల్దేరుతారు. జడ్చర్ల, కొత్తకోట నుంచి మదనాపురం మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు కురుమూర్తికి చేరుకుంటారు. 

12.10 గంటలకు రూ.110 కోట్లతో కురుమూర్తి గుట్టపైకి ఏర్పాటు చేయనున్న ఘాట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 12.30 గంటల నుంచి ఒంటి గంట వరకు కురుమూర్తి వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. కార్యక్రమం ముగిశాక తిరిగి రోడ్డు మార్గాన హైదరాబాద్​కు  వెళ్లిపోనున్నారు. కాగా సీఎం  పర్యటన నేపథ్యంలో శనివారం జోగులాంబ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్ రావు, అడిషనల్ కమిషనర్ నరసింహారెడ్డి, ఆర్అండ్బీ డీఈ రాములు, ఆలయ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ఈఓ మధనేశ్వర్ రెడ్డి, తహసీల్దార్​ ఎల్లయ్య ఏర్పాట్లను పరిశీలించారు. 

ఈ సందర్భంగా పలు సూచనలిచ్చారు.  సీఎం రానున్న సందర్భంగా కురుమూర్తి దేవాలయం చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. టెంపుల్ పరిసర ప్రాంతాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో పది మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 50 మంది ఎస్ఐలతో పాటు 800 మంది పోలీసులు బందోబస్తులో ఉండనున్నట్లు చిన్నచింతకుంట ఎస్ఐ ఆర్.శేఖర్ తెలిపారు.

హెలికాప్టర్ క్యాన్సిల్

సీఎం కురుమూర్తి రెండు రోజుల ఖరారయింది.   ఆయన హెలికాప్టర్ ద్వారా క్షేత్రానికి వస్తారని సమాచారం.  ఈ నేపథ్యంలో అమ్మాపూర్ సమీపంలో ఆఫీసర్లు హెలిప్యాడ్​ను  సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. అయితే శనివారం సాయంత్రం టూర్ ప్రోగ్రాంలో మార్పులు చేశారు. అనివార్య కారణాల హెలీకాప్టర్​ను  క్యాన్సిల్ చేశారు. దీంతో సీఎం రోడ్డు మార్గాన రానున్నారు.