![విశ్వాసం : జూదం - వ్యసనం](https://static.v6velugu.com/uploads/2025/02/faith-is-gambling-and-addiction_EiHICeZJ4v.jpg)
మానవులు నియమబద్ధమైన జీవితాన్ని గడపడానికి ఎంతో కృషి అవసరం. అటువంటి జీవితాన్ని గడిపేవారు ఉన్నత లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ఆ లక్ష్యాలను చేరుకోకుండా సప్త వ్యసనాలు మనిషిని బలంగా లాగేసుకుంటాయి. వాటినుంచి బయటపడలేక మనిషి అధోగతిపాలవుతుంటాడు.
అవి పరస్త్రీ వ్యామోహం, జూదం, మద్యపానం, వేట, పరుషంగా మాట్లాడటం, కఠినంగా దండించటం, అక్రమ ధనార్జన. సప్తవ్యసనాలలో ఒకటైన జూదం కలిపురుషుని నివాస స్థానం. ధర్మరాజు, నల మహారాజు వంటి వారు జూదం ఆడటం వల్ల ఎన్ని అగచాట్లు పడ్డారో తెలిసినదే. ఈ రోజుల్లోనూ జూదంగా చెప్పుకునే పేకాట, గుర్రం, కోడి పందాలు లాంటి వ్యసనాల వల్ల కొన్ని వందల కుటుంబాలు ఇక్కట్ల పాలవుతున్నాయి.
జూదం గురించి ఋగ్వేద సూక్త సంగ్రహంలో అక్షస్సూక్తములోని పదవ మండలము, 34వ సూక్తము, 7వ అష్టకము, 8వ అధ్యాయము, 3వ వర్గము ఎంతో విపులంగా చెబుతోంది. దీని మీద కలి ఉంటాడని అందరికీ తెలుసు. ఈ విషయం మహాభారతం నలోపాఖ్యాన ఘట్టంలో చెబుతుంది. తాని లేదా విభీతక అనే చెట్టు కాయలనే పాచికలుగా వాడతారు. ఈ వృక్షాన్ని ఉత్తరభారతదేశంలో నిషేధించారు.ఈ చెట్టు నీడలో కూర్చోరు. దీనిని రాక్షసులు నివసించేదిగా భావిస్తారు.
మౌజ పర్వతములో పుట్టిన ఉత్కృష్టమైన సోమలత నుండి తయారైన సోమపానం వల్ల దేవతలకు ఎలా తాత్కాలిక ఆనందం కలుగుతుందో, అదే విధముగా పాచికలు జూదరులను తాత్కాలికంగా సంతోషపరుస్తాయి. (అయితే సోమలత, విభీతక.. రెండూ ఎన్నో ఔషధ గుణాలు కలిగివున్నాయి). అవి జూదరిలోని వ్యసనాన్ని మేలుకొల్పి, వారిని అవస్థల పాలు చేస్తాయి. అందరినీ కోల్పోయిన జూదరి... ‘‘జూదం అనే వ్యసనానికి బానిసనైనప్పటికీ నా భార్య నన్ను ఎప్పుడూ కోపగించుకోలేదు. నన్ను అగౌరవ పరచలేదు. కానీ పాచికలు ఆడటమే ముఖ్యమైన పనిగా కలిగిన నన్ను, నా మేలు కోరి హెచ్చరించింది. నేను అంతటి మంచి భార్యను వదులుకున్నాను. నేను జూదం ఆడకుండా మా అత్తగారు అడ్డుకుంది. నా భార్యను, కుటుంబాన్ని పోగొట్టుకున్నాను ’’ అనుకుంటాడట.
మనిషి దురాశాపరుడు కావటం వల్లనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సులువుగా డబ్బును సంపాదించే మార్గం కోసం ఎదురుచూస్తాడు. ధర్మరాజు రాజసూయ యాగం చేసిన సమయంలో రాజులందరూ తెచ్చిన కానుకలను అందుకోవలసినదిగా అక్కడ దుర్యోధనుడిని నియమించాడు. అసలే ఈర్ష్య అసూయలతో నిండిన దుర్యోధనుడు... ఆయా సంపదలను చూసి ఓర్వలేకపోయాడు. యాగపరిసమాప్తి తరువాత ఇంటికి వెళ్లిన దుర్యోధనుడు, తన తండ్రి ధృతరాష్ట్రుడి దగ్గర అసూయను వెళ్లగక్కాడు. ఆ సమయంలో దుర్యోధనుడికి శకుని మామ సలహా ఇచ్చాడు.
‘‘ధర్మరాజును నువ్వు జూదానికి రప్పించినట్లయితే, నేను నా దగ్గర ఉన్న పాచికలతో కపట జూదం ఆడి, వారి సంపదలను నీకు అందేలా చేస్తాను. అంత సంపదను మనం సంపాదించాలంటే ఎంతో కష్టంతో కూడిన పని. అందుకే ఈ పాచికల ద్వారా మూడు క్షణాలలో సంపదలను సంగ్రహించవచ్చు’’ అని కపటోపాయాన్ని దుర్యోధనుడికి వివరించాడు. ఆ విషయాన్ని దుర్యోధనుడు ధృతరాష్ట్రుడికి చెప్పి, ఒప్పించి, ధర్మరాజుతో జూదం ఆడి, మొత్తం సంపదలను, రాజ్యాన్ని హరించాడు. వారిని పదమూడు సంవత్సరాలు అరణ్యాలకు పంపేశాడు.
పాచికలు జూదరికి ధనం మీద ఆశను పెంచుతాయనడానికి ఇది పెద్ద ఉదాహరణ. జూదంలో ఓడే కొద్దీ అవమానాలు పొందుతుంటాడు. ద్రౌపదీ వస్త్రాపహరణం జరగడానికి ఈ పాచికలే కదా కారణం. ఓడుతున్నప్పటికీ, మరోసారి గెలవగలమనే వ్యామోహంలో తమ్ములను, భార్యను కూడా ఓడిపోయాడు ధర్మరాజు. దుర్యోధనుడు తాత్కాలికంగా రాజ్యం సంపాదించినా కురుక్షేత్ర యుద్ధంలో ఓడిపోయి వంశ నాశనానికి కారకుడయ్యాడు.
ధర్మరాజు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాడు. జూదరి పాచికలను తలచుకుని, ‘అమ్మో! వీటి వ్యామోహంలో పడకూడదు’ అనుకున్నప్పటికీ, బభ్రువర్ణంలో ఉండే అక్షములు (పాచికలు) ఎప్పుడైతే జూదపటం మీద వేయబడి శబ్దం చేస్తాయో, అప్పుడు తన దృఢ సంకల్పాన్ని విడిచిపెట్టి, ఆ వ్యసనంలోకి కాలు పెట్టేస్తాడు. అలా వెళ్లే ముందు తన మీద తనకు మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించుకుంటాడు. ‘నేను ఈ జూద క్రీడలో నిష్ణాతుడిని. నా శత్రువు మీద నేను తప్పకుండా విజయం సాధిస్తాను’ అనుకుంటూ జూదం మీద తన కోరికను రెట్టింపు చేసుకుంటాడు.
ఈ పాచికలే అంకుశంలాగ మారి, తనకు పరా జయం తీసుకువచ్చి, తన కుటుంబాన్ని కష్టాల పాలు చేస్తుందని ఆ మైకంలో తెలుసుకోలేకపోతాడు.
సత్యమే ధర్మంగా కలిగిన ఈ జగత్తుకు సూర్యుడు ప్రేరకుడు. ‘‘క్రూరునికి, కోపం ఉన్న వానికి ఈ పాచికలు లొంగవు. చివరకు జగత్తునకు ఈశ్వరుడైన రాజు కూడా ఈ పాచికలను ఆడే సమయంలో వాటికి నమస్కరిస్తాడే తప్ప అవమానపరచడు. ఈ పాచికలు ఒక్కొక్కసారి జూదరికి స్వాధీనమై ఉంటాయి. ఒక్కొక్కసారి పరాజయానికి కారణం అవుతాయి’’ అని కూడా ఋగ్వేదం చెబుతోంది.
నిప్పు కణికలతో సమానమైన ఈ పాచికలు.. ఇంధనం లేకుండా మంటను మండించే జూద పటం మీద వేసినప్పుడు చల్లగా ఉన్నప్పటికీ, ఓటమి చేత కలిగే తాపంతో, ఓటమిపాలైన జూదరి హృదయాన్ని దహించి వేస్తాయి. జూదరి భార్య విలపిస్తుంది. జూదరి తల్లి దుఃఖిస్తుంది. జూదరి అప్పులపాలవుతాడు. ఆ అప్పు తీర్చడానికి దొంగతనం చేయడానికి బయలుదేరతాడు. కుక్క తోక వంకర అన్న చందాన మళ్లీ పాచికలను జూదం కోసం సిద్ధం చేస్తాడు. ‘‘మూర్ఖుడైన ఒక జూదరి ఒక రాత్రి చలికి తట్టుకోలేక, జూదశాలలో అగ్నికి సమీపంలో నిద్రించాడు. తన తప్పును పూర్తిగా అర్థం చేసుకున్నాడు. నేటి నుంచి నేను పాచికల కోసం ధనాన్ని పందెంగా పెట్టను. నా చేతులకు ఉన్న పది వేళ్లను, తూర్పు ముఖముగా చేసి నమస్కరిస్తున్నాను’’ అని పశ్చాత్తాపం చెందినట్లుగా వేదం చెబుతోంది.
అందుకే పెద్దలు జూదం ఆడకండి, వ్యవసాయం మాత్రమే చేసి, ఆ సంపాదించిన ధనంతో ఆనందాన్ని, సుఖాన్ని అనుభవించండి అని చెబుతున్నారు.
జూదమే కాదు, ఏ వ్యసనమైనా మనిషిని పాతాళంలోకి తోసేస్తుంది. అంతిమంగా మానసిక వ్యథకు గురి చేసి, మనిషి ఆత్మహత్యకు పూనుకునేలా చేస్తుందని ఋగ్వేదం చెబుతున్న అక్షస్సూక్తం మనకు తెలియచేస్తోంది. (నేడు కొందరు ఆన్లైన్ లో పందెం కాసి ధనం పోగొట్టుకుని ఆత్మ హత్య చేసుకొన్న ఘటనలు ఎన్నో చూస్తున్నాము )
- డా. పురాణపండ వైజయంతి-