
పురాణ ఇతిహాసాలలోని కథలను పరిశీలిస్తే.. మనకు అడుగడుగునా వరాలు, శాపాలు కనిపిస్తూనే ఉంటాయి. అనుగ్రహించి ఇచ్చేది వరం, ఆగ్రహించి ఇచ్చేది శాపం. అంటే ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా చేసిన మంచి పనికి ప్రతిఫలంగా లభించేదే వరం. ఒక వ్యక్తి చేసిన చెడ్డ పనికి ప్రతిగా లభించేదే శాపం. ఇలా వరాల గురించి, శాపాల గురించి సాధారణ పరిభాషలో చెబుతుంటారు.
అయితే అపాత్ర దానం అన్నట్లుగానే అర్హత లేని వారికి వరాలు ఇవ్వడం వల్ల వరం ఇచ్చినవారు ఇబ్బందుల పాలయిన కథలు కూడా చరిత్రలో ఉన్నాయి. అలాగే అటువంటి వరాలు పొందినవారి వల్ల, ఇతరులు కూడా ఇక్కట్లపాలయిన సంఘటనలు చాలా ఉన్నాయి. అందుకే వరాలు ఇచ్చేటప్పుడు అవతలి వ్యక్తి గుణగణాలను జాగ్రత్తగా పరిశీలించాలంటారు పెద్దలు.
సద్గుణసంపన్నుడికి ఇచ్చే వరం వల్ల సమాజం అందంగా రూపుదిద్దుకుంటుంది. మహాభారతంలో దుర్యోధనుడు ధర్మరాజు సంపదలు చూసి అసూయచెంది, ఏదో ఒక విధంగా వారి సంపదలను దక్కించుకోవాలనుకున్నాడు. శకుని సలహా మేరకు ధర్మరాజుని జూదానికి ఆహ్వానించాడు. ఇరుపక్షాల మధ్య ద్యూతక్రీడ సాగింది. శకుని కపటోపాయంతో ఆడి, ధర్మరాజుని ఓడించాడు. వారు సర్వమూ ఓడిపోయారు.
ద్రౌపదికి పరాభవం జరిగింది. విషయం గ్రహించిన ధృతరాష్ట్రుడు ద్రౌపదిని పిలిచి, ‘‘నీకు జరిగిన అన్యాయానికి చింతిస్తున్నాను. జరిగి పోయిన దానికి నేనేమీ చేయలేను. అందుకు ప్రతిగా నీవు కోరిన వరము నెరవేర్చదలచుకున్నాను. కోరుకో’’ అన్నాడు. అందుకు ద్రౌపది.. ‘‘లోకపూజితుడైన ధర్మరాజుకి దాస్య విముక్తి కలిగించు ప్రభూ’’ అని కోరింది. ‘‘సంతోషం తల్లీ, మరో వరం కోరుకో’’ అన్నాడు. అందుకు ద్రౌపది, నెమ్మిని ధర్మజు నలువురు దమ్ములు దమ యాయుధముల తమ వర్మ వరూధమ్ములయు తోడ సకల హితమ్ముగ బాయంగ వలయు దాస్యమువలనన్ (సభాపర్వం ద్వితీయాశ్వాసం, 261 వ పద్యం).
ధర్మరాజు యొక్క నలుగురు తమ్ముళ్లు వారి వారి ఆయుధాలతో, వారి కవచాలతో, వారి గృహాలతో అందరికీ మేలు కలిగేటట్లు దాస్యం నుండి విముక్తి పొందాలి.. అని కోరింది. సంతోషంతో ధృతరాష్ట్రుడు సరేనన్నాడు. మూడో వరం కోరుకోమన్నాడు. అందుకు ద్రౌపది, ‘సత్ క్షత్రియ సతి రెండు వరాలు మాత్రమే కోరుకోవడం ధర్మం’ అని పలికింది.
సదాలోచన కలిగిన ద్రౌపది కోరిన వరాలు. అదే దురాలోచన కలిగిన వారిని వరాలు కోరుకోమంటే, తనను పరాభవించిన కౌరవుల నాశనాన్ని కోరుకుంటారు. న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉంది కనుకనే, ద్రౌపది.. తనవారి క్షేమాన్ని కోరుకుంది. వారిని దాస్య విముక్తులను చేసింది. తనకు లభించిన వరాన్ని ధర్మబద్ధంగా తీసుకుంది ద్రౌపది. మూడో వరంగా యావత్ కౌరవ సామ్రాజ్యాన్ని కోరుకోవచ్చు. ఆమె కోరితే ధృతరాష్ట్రుడు ఇచ్చి తీరవలసిందే. కాని ద్రౌపది ధర్మపరురాలు. అధర్మంగా దేనినీ కోరుకోదు.. అని ఈ ఘట్టం మనకు చెబుతోంది.
కుంతికి లభించిన వరాలు...
కుంతిభోజుని కుమార్తె కుంతి. ఆమె తన తండ్రి కోరిక ప్రకారం.. విప్రవరులకు అతిథి జనులకు నిరంతరాయంగా మృష్టాన్నదానం చేస్తుండేది. ఒకరోజు దూర్వాసుడు, సిద్ధమునియు వచ్చారు. వారు అతిథిౖయె భోజనంచేశారు. వారు కోరిన ఆహారం ఎంతో వినయవిధేయతలతో అందించింది కుంతీదేవి. ఆమె సత్ప్రవర్తనకు సంతుష్టుడైన ఆ ముని, ‘నీకు నేనొక మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఈ మంత్రం వలన నువ్వు ఏ వేల్పుని ఆరాధించితే ఆ వేల్పు ప్రత్యక్షమై, నీవు కోరిన కుమారులను నీకు ప్రసాదిస్తారు’’ అని ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. (ఆదిపర్వం పంచమాశ్వాసం).
దూర్వాసుడు ఇచ్చిన వరాన్ని పరీక్షించదలచి కుంతీదేవి సూర్యభగవానుడిని ప్రార్థించింది. ఆయన ప్రత్యక్షమై సద్యోగర్భాన కర్ణుడిని పుత్రునిగా ప్రసాదించాడు. కొంతకాలానికి పాండురాజుతో వివాహమైంది కుంతికి. పాండురాజు శాపం కారణంగా, కుంతీదేవి సంతానం కోసం దూర్వాసుడు వరంగా ఇచ్చిన మంత్రాన్ని స్మరించి యమధర్మరాజు ద్వారా ధర్మరాజుని, వాయుదేవుని కారణంగా భీముడిని, ఇంద్రుని అనుగ్రహంతో అర్జునుడిని ప్రభవించింది.
కుంతీదేవి సత్ప్రవర్తన కారణంగానే దూర్వాసుడు ఆ వరాన్ని ఆమెకు ప్రసాదించాడు. ఆ వరాన్ని ఆమె దుర్వినియోగం చేసుకోదనే నమ్మకంతోనే దూర్వాసుడు అంతటి గొప్ప వరాన్ని ప్రసాదించాడు. సద్గుణశీలి, ఉన్నత వంశంలో జన్మించిన కారణంగా కుంతీదేవి దూర్వాసుడు ప్రసాదించిన వరాన్ని సత్కార్యం కోసం మాత్రమే వినియోగించుకుంది.
అందుకే పాత్రనెరిగి దానం చేయమన్నారు పెద్దలు.