విశ్వాసం : సద్గుణమే ఆభరణం 

విశ్వాసం : సద్గుణమే ఆభరణం 

మానవులు సక్రమ మార్గంలో నడవడానికి సుగుణాలు కలిగి ఉండాలంటారు పెద్దలు. ఏది సుగుణం, ఏది దుర్గుణం అంటే.. ఇతరులకు హాని చేయని లక్షణమే సుగుణం. మనం చేసిన పని కారణంగా ఇతరులకు హాని కలిగితే అదే దుర్గుణం. ఇది మాత్రమే కాదు.. శరీరానికి హాని చేసే పనులు చేయడం కూడా దుర్గుణంలో భాగమే. మనం చేసే ప్రతి పని, మన ప్రవర్తన..మన ఆలోచన.. మన మనసుకు హాయిని కలిగిస్తూ, మన బుద్ధిని వికసింపచేస్తూ, శరీరాన్ని సక్రమంగా నడిపే లక్షణాలన్నీ సుగుణాలే. నోటి దురుసుతనం, పరుషభాషణం.. అత్యంత ప్రమాదకరమైన దుర్గుణాలు. ఇటువంటివాటికి దూరంగా, మృదువుగా మాట్లాడుతూ, సాధ్యమైనంతవరకు ఒరులకు మంచి కలిగేలా ప్రవర్తించడమే సుగుణశీలురకుండే లక్షణం.


తమ సత్ప్రవర్తనతో వారివారి సౌందర్యాన్ని రెట్టింపు చేసుకున్నవారిలో ప్రముఖంగా నలుగురిని గుర్తు చేసుకోవచ్చు. పార్వతీదేవి, సీతాదేవి, ద్రౌపది, దమయంతి. సద్గుణాలు అందాన్ని రెట్టింపు చేస్తాయనడానికి వీరి సచ్ఛీలతే నిదర్శనం.‘కుమార సంభవం’ కావ్యంలో పార్వతీదేవి పరమశివుని గురించి తపస్సు చేస్తుంది. ఆ తపస్సు చేసే సమయంలో ఆవిడ జుట్టు ఎర్రబడిపోయి, ముఖమంతా ధూళిధూసరితమైపోయి తన అందాన్ని తగ్గించుకుంటుంది. ఆ సందర్భంలో సప్త ఋషులు ఆమె తపస్సును చూసి.. ‘అందంగా ఉండేవారు తపస్సు చేస్తారనడానికి ఈ తల్లియే నిదర్శనం’ అని ప్రశంసించినట్లుగా కాళిదాసు వర్ణించాడు. ఏ సందర్భంలోనూ పార్వతీదేవి తన స్వాభిమానాన్ని విడిచిపెట్టలేదు. అందువల్లే సప్త ఋషుల ఆశీర్వాదాలు అందుకుంది. 

రామాయణంలోకి ప్రవేశిస్తే..  

సీతారాములు అరణ్యవాసానికి వచ్చారు. రామలక్ష్మణులు కుటీరంలో లేని సమయంలో రావణుడు వచ్చి సీతమ్మను అపహరించాడు. లంకా నగరంలో అశోకవనంలో శింశుపా వృక్షం కింద ఆమెను ఉంచాడు. ప్రతిరోజూ ఉదయాన్నే అక్కడకు వచ్చి, సీతమ్మ అందం గురించి ప్రశంసిస్తూ, ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తాడు. తనను అనుగ్రహించమంటాడు. సీతమ్మ ఆ రాక్షసుడిని గడ్డిపోచ కింద తీసిపారేస్తుంది.

అతిలోక సౌందర్యవతియైన సీత, మట్టి నేల మీద రాక్షసుల నడుమ మబ్బు పట్టిన చంద్రబింబంలా ఉన్నప్పటికీ తన స్వాభిమానాన్ని, తన సత్ప్రవర్తనను విడిచిపెట్టలేదు. అందుకే సీతాదేవి అగ్ని ప్రవేశం చేయబోతుండగా, ఆ అగ్ని దేవుడు భీతుడై, ఆవిడకు అగ్ని సోకకుండా, సీతమ్మ ఔన్నత్యాన్ని ప్రశంసించాడు. తన సత్ప్రవర్తనతో సీతమ్మ అందం సకల ఆభరణాలను తలదన్నింది. 

మహాభారతంలో ద్రౌపది.. 

శకుని సహాయంతో దుర్యోధనుడు కపట జూదం ఆడి ధర్మరాజును ఓడించాడు. ఒప్పందం ప్రకారం ద్రౌపదీ సమేతంగా పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. రాజభవనాలలో, పట్టు పరుపుల మీద పరుండిన ద్రౌపది, ఆ సమయంలో తరుమూలాలలో (చెట్టు మొదలు భాగం) శయనిస్తూ, అడవిలో లభించే కందమూలాలను తింటూ, తన స్వాభిమానానికి ఏమాత్రం లోటు రాకుండా గడిపింది.

ఇక అజ్ఞాతవాసం సమయంలో విరాటరాజు భార్య అయిన సుధేష్ట దగ్గర తాను సైరంధ్రిగా ఉంటానంది. తాను సంగీత గానం చేస్తూ, వినోదం కలిగిస్తానని, పర పురుషుల ఇండ్లకు వెళ్లనని తన నియమాలను చెప్పి, తన స్వాభిమానానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేలా ప్రవర్తించింది. తనను కన్నెత్తి చూసిన కీచకుడిని సంహరించేలా చేసింది. అందుకే ద్రౌపదికి తన ప్రవర్తనే పెద్ద అలంకారం అయింది.

ఇక దమయంతి..

నిషధ దేశాన్ని పరిపాలించే నలమహారాజును స్వయంవరంలో వివాహమాడింది దమయంతి. పుష్కరుడితో కలి ఆడించిన కపట జూదంలో నల మహారాజు రాజ్యాన్ని పోగొట్టుకుని, దమయంతితో కలసి అడవులకు బయలుదేరాడు. విధి వక్రించి, ఒకనాడు రాత్రి దమయంతి నిద్రిస్తున్న వేళ నలుడు ఆమెను విడిచి వెళ్లిపోయాడు. చిరిగిన, మాసిన బట్టలతో, చింపిరి జుట్టుతో దమయంతి నలుడిని అన్వేషించటం మొదలుపెట్టింది. అలా ప్రయాణిస్తుండగా ఒక నగరంలో ఒక రాజమాత దమయంతిని చూసి, పిలిపించి, తన దగ్గర నిర్భయంగా ఉండవచ్చని పలికింది.

అప్పుడు దమయంతి, ‘నేను మీ దగ్గర సైరంధ్రింగా ఉంటాను. నేను ఎవరి ఎంగిలీ తినను. ఎవరికీ కాళ్లు నొక్కటం వంటి పని చేయను. నా భర్తను అన్వేషించటానికి వెళ్లే బ్రాహ్మణులతో తప్ప అన్య పురుషులతో మాటాడను. అందుకు అంగీకారమైతేనే నీ వద్ద ఉంటాను తల్లీ’ అని పలికింది. అంత కష్టంలో ఉన్నప్పటికీ సౌందర్యవతిౖయెన దమయంతి, తన సత్ప్రవర్తనను విడిచిపెట్టలేదు. ఎటువంటి ప్రలోభాలకు లొంగలేదు. అందుకే నేటికీ వీరంతా ఆదర్శంగా నిలుస్తున్నారు.ఇటువంటి ప్రవర్తన ఆనాడే కాదు, నేడు కూడా అందరికీ ఆవశ్యకమని భారత, రామాయణాలు మనకు చెబుతున్నాయి.


- డా. పురాణపండ వైజయంతి