- రూ.6.91 లక్షల విలువైన నకిలీ మందులు స్వాధీనం
- ఇద్దరు అరెస్టు
హైదరాబాద్, వెలుగు: సుద్దముక్కలు, బియ్యం పిండితో తయారైన నకిలీ యాంటీబయాటిక్స్ మందులను విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.6.91 లక్షల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో తయారైన నకిలీ మందులను తెలంగాణకు కొరియర్లో తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో డ్రగ్స్ కంట్రోల్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేసి సరుకును స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ లోని బాలానగర్ లో తిరుపతి కొరియర్‌కు వచ్చిన నకిలీ మందులను, పెద్ద మొత్తంలో ఫెంటానిల్ ట్రాన్స్‌డెర్మల్ ప్యాచ్‌లను సీజ్ చేశారు. ఈ ప్యాచ్‌లను సర్జరీలు జరిగినప్పుడు పెయిన్ కిల్లర్స్‌లా యూజ్చేస్తారు. అనుమతి లేకపోయినా తీసుకువచ్చి ఇతర జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. ఏపీలోని ప్రొద్దుటూరుకు చెందిన ముని శేఖర్, గండ్ర రాములు నకిలీ మందులను హైదరాబాద్‌కు తెప్పించారని, వాటిని కరీంనగర్, కర్నూల్ జిల్లా కేంద్రాల్లో దుకాణాలకు సరఫరా చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.