హనుమకొండ : కుటుంబ సమస్యలకు పరిష్కారం చూపుతానని మాయమాటలతో మహిళలు, యువతులను లోబర్చుకుని అత్యాచారాలకు పాల్పడుతున్న దొంగ బాబాను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.25 వేల నగదు, తాయత్తులు, వన మూలికలు, దారాలు, నిమ్మకాయలు, నూనె డబ్బాలు, తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎం.జితేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన లబ్బే దాదాపు 40 ఏండ్ల కిందట వరంగల్ నగరానికి వచ్చాడు. ఏనుమాముల ఏరియాలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు.
బాబా అవతారమెత్తి తన మంత్ర శక్తులతో కుటుంబ కలహాలు, భార్యాభర్తల తగాదాలు, ఆరోగ్య సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తానంటూ చుట్టుపక్కల వారిని నమ్మించాడు. ఈ క్రమంలోనే పలువురు మహిళలు, యువతులను మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఇదిలాఉంటే తన భర్తతో ఉన్న విభేదాలను పరిష్కరించాల్సిందిగా కొద్దిరోజుల కిందట ఓ మహిళ అతడిని సంప్రదించగా.. పూజలు చేస్తున్నట్టు నటించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో భయభ్రాంతులకు గురైన ఆమె అసలు విషయాన్ని ఇంట్లో చెప్పింది. బాధితురాలితో కలిసి కుటుంబ సభ్యులు టాస్క్ ఫోర్స్ పోలీసులను ఆశ్రయించడంతో దొంగ బాబా బాగోతం బయటపడింది.
నిందితుడిని విచారించగా.. అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. అనంతరం టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని విచారణ నిమిత్తం ఏనుమాముల పోలీసులకు అప్పగించారు. దొంగ బాబాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ సీఐలు శ్రీనివాస్ రావు, జనార్ధన్ రెడ్డి, ఎస్సైలు శరత్ కుమార్, లవన్ కుమార్, సిబ్బంది స్వర్ణలత, రాజేందర్, కరుణాకర్, శ్రావణ్ కుమార్, నాగరాజును టాస్క్ ఫోర్స్ ఏసీపీ అభినందించారు