
ఎల్బీనగర్, వెలుగు: మీ ఇంట్లో చాలా సమస్యలున్నాయి.. పూజలు చేసి, పరిష్కరిస్తానని నమ్మించాడు.. మహిళ వద్ద నుంచి రూ.7.40 లక్షలు కాజేశాడో నకిలీ బాబా. ఈ ఘటన నాగోల్పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. సాయి నగర్ రోడ్డు నంబర్–3కి చెందిన అనూష ఇంటికి గతేడాది డిసెంబర్ లో జాతకాలు చెబుతామని, ఇంట్లో ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తానంటూ ఓ నకిలీ బాబా వచ్చాడు. ఆమె కుటుంబంలో జరిగిన రెండు, మూడు సంఘటనల గురించి చెప్పి, నమ్మించాడు.
దీంతో, అనూష అతనికి రూ.1,500 ఇచ్చింది. తాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పడంతో.. మీ ఫోన్నంబర్ఇవ్వండని అడిగి, తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఫోన్ చేసి, నీ భర్త, పిల్లలకు కూడా బాగోలేదని, సమస్యలున్నాయన్నాడు. వాటిని సరిచేయడానికి డబ్బు ఖర్చవుతుందని తెలుపడంతో ఫోన్ పే ద్వారా రూ.35 వేలు కొట్టింది. రెండు, మూడు రోజుల తర్వాత ఫోన్ చేసి, ఆ పూజ పని చేయలేదు.. మళ్లీ చేయాలని రూ.2.70 లక్షలు అడిగాడు. ఆ డబ్బులను సాయినగర్ లోని లక్కీ రెస్టారెంట్ వద్దకు అతను పంపిన వ్యక్తికి ముట్టజెప్పింది.
ఇలా పలు దఫాలుగా మొత్తం రూ.7.40 లక్షలు ఇచ్చింది. అనంతరం ఆ నకిలీ బాబా పూజలు చేయకుండా తప్పంచుకు తిరుగుతూ ఫోన్ ఎత్తడం లేదు. తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు రెండు రోజుల క్రితం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.