
- ఢిల్లీ, నోయిడా, బెంగళూరు, వెస్ట్ బెంగాల్ నుంచి నేరగాళ్ల ఆపరేషన్స్
- తెలియకుండానే సైబర్ నేరగాళ్లుగా మారుతున్న టెలీకాలర్లు
- పోలీస్ రెయిడ్స్‌లో టెలీకాలర్స్, మేనేజర్లు మాత్రమే అరెస్ట్
- గతంలో మాదాపూర్‌లో 3 కాల్ సెంటర్లపై దాడులు
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్లు హైటెక్ సిటీ కేంద్రంగా ఫేక్ కాల్‌సెంటర్లు నడుపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. హైటెక్ హంగులతో వీటిని ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతను ట్రాప్ చేస్తున్నారు. టెలీకాలర్ ఉద్యోగాల పేరుతో సైబర్ క్రిమినల్స్‌గా మార్చుతున్నారు. అమెరికన్లు టార్గెట్‌గా నిర్వహిస్తున్న ఫేక్ కస్టమర్ కేర్ సెంటర్‌పై బుధవారం (మార్చి 12) సీఎస్‌బీ పోలీసులు రెయిడ్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎగ్జిటో సొల్యూషన్స్ సంస్థ ఎండీ చందా మనస్విని సహా 63 మందిని అరెస్ట్ చేశారు.
ఇదే తరహాలో సైబరాబాద్ కేంద్రంగా పలు నకిలీ కాల్ సెంటర్లు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎంఎన్‌సీ కంపెనీల మధ్య కార్పొరేట్ ఆఫీస్‌లు ఓపెన్ చేసి అట్రాక్ట్ చేస్తున్నట్లు టెలీకాలర్స్ నుంచి సమాచారం సేకరించారు. చాలా మంది టెలీకాలర్లు.. తాము సైబర్ నేరాలు చేస్తున్నామనే విషయం కూడా గుర్తించలేకపోతున్నారని దర్యాప్తులో బయటపడింది.
లేడీ టెలీకాలర్స్‌తో ట్రాప్
గుజరాత్, ఢిల్లీ గ్యాంగ్స్ ఫేక్ కాల్ సెంటర్స్‌ను ఎక్కువగా ఆపరేట్ చేస్తున్నాయి. బ్యాంక్ ఫ్రాడ్స్, లోన్ యాప్స్, ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్ సహా ఆన్‌లైన్ మోసాల్లో ఫేక్ కాల్‌సెంటర్స్ కీలకంగా పనిచేస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ జీతం, కమీషన్ పేరుతో నిరుద్యోగులను ట్రాప్ చేస్తున్నారు. యువతులనే ఎక్కువగా టెలీకాలర్స్‌గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. హిందీ, ఇంగ్లీష్ మాట్లాడే వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
స్వీట్ వాయిస్‌తో మాట్లాడి అవతలి వారిని నమ్మించే విధంగా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. దీంతో వారికి తెలియకుండానే సైబర్ క్రిమినల్స్‌గా మారుతున్నారు. గతంలో నోయిడా, బెంగళూరు, వెస్ట్‌బెంగాల్ సహా నార్త్ ఇండియాలో ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్‌లో ఈ కాల్ సెంటర్స్ ఎక్కువగా పనిచేసేవి. ఇలాంటివే యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ సెల్, అమెజాన్ ఆర్డర్స్ పేరుతో కాల్‌సెంటర్లు నిర్వహిస్తున్న మూడు గుజరాత్ గ్యాంగులను 2023 ఆగస్టులో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒక్కొక్కరు రోజు 100 కాల్స్
వివిధ కంపనీల పేర్లతో కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు, ఫేక్ అడ్రస్‌లతో సిమ్ కార్డులు, బ్యాంకు అకౌంట్స్ సేకరిస్తున్నారు. కాల్ సెంటర్‌లో పనిచేసే టెలీ కాలర్స్‌పై పటిష్టమైన నిఘా పెడుతున్నారు. ప్రధాన నిందితులు ఢిల్లీ, కోల్‌కతా, దుబాయ్‌లో ఉండి కాల్‌సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. కాల్ సెంటర్ బాధ్యతలను చూసుకునేందుకు ఎండీలు, మేనేజర్లు, సూపర్‌వైజర్లు ఉంటారు. ఒక్కో టెలీకాలర్ రోజుకు సుమారు 100 కాల్స్ చేయాలి. అందులో కనీసం 80 శాతం కాల్స్ నుంచి తమకు కావల్సిన సమాచారం రాబట్టాలి. టార్గెట్ రీచ్ అయితే కమీషన్స్, గిఫ్ట్స్ ఇస్తామని ఆశ చూపుతారు.
హైదరాబాద్‌తో పాటునార్త్ ఇండియాకే ఎక్కువ కాల్స్
దేశవ్యాప్తంగా అన్ని భాషల వారిని టార్గెట్ చేస్తారు. ముఖ్యంగా హిందీ మాట్లాడే నార్త్ ఇండియన్లతో పాటు హైదరాబాద్, తెలంగాణ ప్రజలకు ఎక్కువ కాల్స్ చేస్తారు. అలాగే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో సిటీలలో స్పష్టమైన ఇంగ్లీష్ మాట్లాడే వారిని టెలీకాలర్స్‌గా నియమిస్తారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ను ఆసరాగా చేసుకుని వరుస మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులు రెయిడ్స్ చేసిన సమయంలో టెలీకాలర్స్, మేనేజర్స్ తప్ప అసలు మోసగాళ్లు పోలీసులకు చిక్కడం లేదు.
యూఎస్ డాలర్స్‌ను క్రిప్టో, బిట్‌కాయిన్స్‌గా ఇండియాకు
యూఎస్ సిటిజన్ల నుంచి కొట్టేసిన డబ్బును గిఫ్ట్ వోచర్స్ కోడ్ రూపంలో సేకరిస్తున్నారు. గిఫ్ట్ వోచర్లను ‘పాక్స్‌ఫుల్ వెబ్‌సైట్’లో కొనుగోలు చేస్తుంటారు. క్రిప్టో కరెన్సీని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ దిట్రెజరీ(యూఎస్‌డీటీ)గా కన్వర్ట్ చేస్తున్నారు. లోకల్ బిట్‌కాయిన్.కమ్ ద్వారా క్రిప్టో కరెన్సీని ఇండియన్ కరెన్సీ(ఐఎన్‌ఆర్)గా మార్చేస్తున్నారు. ఇదంతా దుబాయ్ కేంద్రంగా ఆపరేట్ చేస్తున్నారు. తర్వాత ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వేస్ ఐఎంపీఎస్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా తమ అకౌంట్స్‌లో డిపాజిట్స్ చేసుకుంటున్నారు.