‘రూ.5 కోట్లు ఇస్తే మంత్రి పదవి’.. కేంద్రమంత్రి కొడుకు పేరుతో బీజేపీ ఎమ్మెల్యేలకు ఆఫర్

‘రూ.5 కోట్లు ఇస్తే మంత్రి పదవి’.. కేంద్రమంత్రి కొడుకు పేరుతో బీజేపీ ఎమ్మెల్యేలకు ఆఫర్

డెహ్రాడూన్: ఉత్తరఖాండ్‎లో అధికార బీజేపీ ఎమ్మెల్యేలకు వరుసగా ఫేక్ కాల్స్ రావడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించింది. గుర్తు తెలియని ముఠా గత వారం రోజులుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుని బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. ఏకంగా ఓ కేంద్రమంత్రి కొడుకు పేరు చెప్పి మోసానికి తెరలేపారు. ఒక్కరికి కాదు ఇద్దరికి ఏకంగా ఆరుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇవే తరహా కాల్స్ చేసి డబ్బు లాగే ప్రయత్నం చేశారు. ఉత్తరఖాండ్‎లో పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. 

ధామి కేబినెట్‎లో ప్రస్తుతం నాలుగు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ జరగనున్నట్లు ఉత్తరఖాండ్‎లో పాలిటిక్స్‎లో ప్రచారం జరుగుతోంది. దీంతో మంత్రి పదవి కోసం ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సరిగ్గా ఈ అంశాన్నే అవకాశంగా మల్చుకున్న కేటుగాళ్లు.. మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తోన్న ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు. నిందితులు ఒక ముఠాగా ఏర్పడి వరుసగా బీజేపీ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేశారు. నేను అమిత్ షా కొడుకు జై షాను మాట్లాడుతున్నానని.. మీకు మంత్రి పదవి కావాలంటే రూ.3 నుంచి 5 కోట్లు ఖర్చు అవుతుందని పలువురు ఎమ్మెల్యేలను డబ్బు డిమాండ్ చేశారు. 

ఇలా మొత్తం ఆరుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశారు కేటుగాళ్లు. బాగేశ్వర్ ఎమ్మెల్యే పార్వతి దాస్, నైనిటాల్ ఎమ్మెల్యే సరితా ఆర్య, హరిద్వార్ ఎమ్మెల్యే ఆదేశ్ చౌహాన్, రుద్రపూర్ ఎమ్మెల్యే శివ్ అరోరా, డెహ్రాడూన్ ఎమ్మెల్యే ఖజన్ దాస్, కేదార్‌నాథ్ ఎమ్మెల్యే ఆశా నౌటియల్‎లకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ఇది ఫేక్ కాల్ నిర్ధారించుకున్న ఎమ్మెల్యేలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుసగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఫేక్ కాల్స్ రావడంతో పోలీసులు ఈ అంశాన్ని సీరియస్‎గా తీసుకుని దర్యా్ప్తు చేపట్టారు. 

Also Read:-ఇండియా దగ్గర చాలా డబ్బు ఉంది.. 

ఈ క్రమంలోనే న్యూఢిల్లీకి చెందిన ప్రియాంషు పంత్ అనే నిందితుడిని హరిద్వార్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు యాక్టివ్ మొబైల్ ఫోన్‌లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పంత్‎తో పాటు మరో ఇద్దరు నిందితులు ఈ ముఠాలో ఉన్నారని.. విలాసవంతమైన జీవితం గడపడం కోసం ఈజీ మనీ సంపాందించడం కోసం ఈ స్కామ్‎కు తెరలేపారని పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తు జరుగుతోందని.. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.