సోషల్ మీడియాలో మాలలపై ఫేక్ ప్రచారం.. వర్గీకరణపై సుప్రీం తీర్పును అనాలసిస్ చేయట్లే: వివేక్​ వెంకటస్వామి

సోషల్ మీడియాలో మాలలపై ఫేక్ ప్రచారం.. వర్గీకరణపై సుప్రీం తీర్పును అనాలసిస్ చేయట్లే: వివేక్​ వెంకటస్వామి

సంగారెడ్డి, వెలుగు: మాలలపై సోషల్ మీడియాలో ఫేక్  ప్రచారం చేస్తున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మాలల్లో కూడా చాలామంది పేదవారు ఉన్నారని చెప్పారు. దళితులు మూడు వేల ఏండ్ల నుంచి కులవివక్ష ఎదుర్కొంటున్నారని తెలిపారు. మాలలకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదన్నారు. ఆదివారం సంగారెడ్డిలో తెలంగాణ మాల ఉద్యోగుల సంఘం వార్షిక సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశానికి వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘వర్గీకరణపై సుప్రీం తీర్పును ఎవరూ అనాలసిస్ చేయడం లేదు. 540 పేజీల ఆర్డర్ కాపీని ఎంతమంది చదివారు? అది ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉంది..ఆ తీర్పులో మాల, మాదిగ అని లేదు” అని అన్నారు. ఎస్సీల డెవలప్మెంట్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించడం లేదని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై తాము ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ‘‘అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లలో మాల, మాదిగ అని లేదు. మాలలపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నరు. మాలల ఐక్యత చూపించేందుకు సభలు పెడుతున్నం. మాలలం అంతా ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలం” అని ఎమ్మెల్యే వివేక్ అన్నారు.

మాదిగల గురించే మందకృష్ణ ఆరాటం

మందకృష్ణ కేవలం మాదిగల గురించే మాట్లాడుతున్నారని వివేక్ వెంకటస్వామి విమర్శించారు. మాల, మాదిగల కన్నా వెనకబడిన ఎస్సీ ఉపకులాల గురించి మాట్లాడడం లేదన్నారు. ఓసీలు పొందుతున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఎస్సీలపై మనువాదులు దాడులు చేస్తున్నా, అత్యాచారాలు చేస్తున్నా ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. 

పార్లమెంటులో బిల్లు పెట్టి ఆర్టికల్ 341 ప్రకారం జరగాలని మోదీని ఎందుకు అడగడం లేదన్నారు. మంద కృష్ణ ఢిల్లీకి వెళ్లి లక్ష డప్పులు ముగించి బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. ఈ సమావేశంలో మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బక్కన్న, సమన్వయకర్త అనంతయ్య, నాగయ్య, ప్రధాన కార్యదర్శి రాజు, ఉపాధ్యక్షుడు పుండరీకం, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.జనార్దన్, జిల్లా అధ్యక్షుడు ఆందోల్ మల్లేశం, కోశాధికారి జి.మొగులయ్య, ఉమాకాంత్, మల్లేశం, అనంతరామ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మాలల కోసం వివేక్ కష్టపడుతున్నరు: మల్లేపల్లి లక్ష్మయ్య

మాలల హక్కుల కోసం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎంతో కష్టపడుతున్నారని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్, బుద్ధవనం ప్రాజెక్టు మాజీ స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. కానీ ఆయనను ఎన్నో తిట్లు తిడుతున్నారన్నారు. ప్రధాని మోదీ ఎజెండాను మందకృష్ణ అమలు చేస్తున్నారని విమర్శించారు. మందకృష్ణ భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారని తెలిపారు. 

అంబేద్కర్ వాదుల మధ్య గొడవ పెట్టేందుకు వర్గీకరణ డ్రామా తెరపైకి తెచ్చారని, బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో వర్గీకరణ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మొన్నటి ఎన్నికల్లో దళితులు, అంబేద్కర్ వాదులు బీజేపీకి ఓటేయలేదనే..  ఆ పార్టీ ఈ నాటకాలు ఆడుతోందని విమర్శించారు. తర్వాత వివేక్‌ వెంకటస్వామిని మాల ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.