
- కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో ఘటన
శంకరపట్నం, వెలుగు: ఎఆర్‌ఎస్‌పీ కెనాల్ కింద భూమి పోయిందని ఫేక్ సర్టిఫికెట్ సృష్టించి, పరిహారం ఇప్పిస్తానని చెప్పి రూ.31లక్షలు వసూలు చేసిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన పూజారి వైరాగ్యపు రాజమల్లయ్యకు ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో 6 ఎకరాలకు పట్టా ఉండగా.. మిగిలిన ఎకరానికి పట్టా లేదు. ఈ భూమికి పట్టా ఇప్పించడంతో పాటు ఎస్సారెస్పీ కెనాల్ కింద పోయినట్లు ఫేక్డాక్యుమెంట్లు సృష్టించి రూ.96 లక్షలు పరిహారం ఇప్పిస్తానని శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన మాచర్ల రాజయ్య నమ్మించాడు.
అతడిని నమ్మిన రాజమల్లయ్య విడతల వారీగా రూ.31 లక్షలు చెల్లించాడు. పరిహారం, ఎకరం భూమికి పట్టా రాకపోవడంతో బాధితుడు కరీంనగర్ కలెక్టరేట్‌కు వెళ్లి ఆరా తీశాడు. ప్రస్తుతం ఎవరికీ పరిహారం చెల్లించడం లేదని అధికారులు చెప్పడంతో మోసపోయానని గ్రహించి రాజయ్యను నిలదీశాడు. ఓ అధికారికి డబ్బులు ఇచ్చానని, అజ్ఞాత వ్యక్తితో ఫోన్ మాట్లాడించాడు. అయినా పని కాకపోవడంతో కేశవపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.