రూ.లక్షకే బీటెక్ సర్టిఫికెట్.. హైదరాబాద్‎లో రెడ్ హ్యాండెడ్‎గా పట్టుబడ్డ ఫేక్ సర్టిఫికేట్ ముఠా

రూ.లక్షకే బీటెక్ సర్టిఫికెట్.. హైదరాబాద్‎లో రెడ్ హ్యాండెడ్‎గా పట్టుబడ్డ ఫేక్ సర్టిఫికేట్ ముఠా

హైదరాబాద్ సిటీ, వెలుగు: రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర తీసుకుని డిగ్రీ, పీజీ, బీటెక్ ఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్న ముఠాను ఫిల్మ్​నగర్​పోలీసులు, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర మంగళవారం వెల్లడించారు. నాంపల్లిలోని బజార్ ఘాట్‎కు చెందిన ఫ్లై అబ్రాడ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ యజమాని మహమ్మద్ హబీబ్ (32), టోలీచౌకీకి చెందిన రజివుల్లా ఖాన్ (35), అలియాబాద్‎లోని అలీనగర్‎కు చెందిన లిబర్టీ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సర్వీసెస్ యజమాని సయ్యద్ ఖలీలుద్దీన్(36),  అలియాబాద్‎లోని ఘాజిబండకు చెందిన సక్లాయిన్​అహ్మద్​సయ్యద్ (25), ఫలక్ నుమాకు చెందిన సయ్యద్ మొయినుద్దీన్ (31), నిజామాబాద్ జిల్లా మల్లపల్లికి చెందిన మహ్మద్ వజాహత్ అలీ(27), యూపీకి చెందిన రాహుల్ తివారీ, సునీల్ కపూర్ ముఠాగా ఏర్పడ్డారు. 

వీళ్లు ఫేక్ సర్టిఫికెట్ల దందా చేస్తున్నారు. నిరుద్యోగులు, డ్రాపౌట్ యువతను టార్గెట్​చేసుకుని.. ఒక్కో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ సర్టిఫికెట్‎ను రూ. లక్ష నుంచి రూ. లక్షన్నర వరకు అమ్ముతున్నారు. ఇందులో ఎక్కువగా తెలంగాణ, ఏపీలోని వర్సిటీలతో పాటు చెన్నైలోని అన్నా వర్సిటీ పేరు మీద ఉన్నాయి. మలక్​పేటలో ఆఫీసు ఏర్పాటు చేసిన ప్రధాన నిందితుడు మహ్మద్ హబీబ్ ఫేక్​సర్టిఫికెట్ల వ్యవహారంలో గతంలో జైలుకు వెళ్లొచ్చాడు. ఇతడు యూపీకి చెందిన ఏజెంట్లు సునీల్ కపూర్, రాహుల్ తివారీ ద్వారా ఫేక్ సర్టిఫికెట్లు కొనుగోలు చేసేవాడు. 2023లో సునీల్ కపూర్ అరెస్టయ్యాక అతడి సహచరుడు తివారీ హబీబ్‎తో దందా కొనసాగించాడు. 

సర్టిఫికెట్లను అతడు హైదరాబాద్‎కు పోస్ట్​ద్వారా పంపేవాడు. మహ్మద్ హబీబ్ ఏజెంట్లు, సబ్ ఏజెంట్లను పెట్టుకుని దందా నడిపేవాడు. ఈ క్రమంలో ఈ నెల 17న వజాహత్ అలీ ఫేక్ సర్టిఫికెట్స్‎తో పోలీసులకు దొరికాడు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అన్ని విషయాలు చెప్పాడు. దీంతో మంగళవారం సికింద్రాబాద్‎లోని పరేడ్ గ్రౌండ్ వద్ద ఐదుగురిని పట్టుకున్నారు. వీళ్లు సిటీ నుంచి పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వీరి దగ్గర 114 ఫేక్ సర్టిఫికెట్లు, 4 ల్యాప్ టాప్‎లు, ప్రింటర్, బైక్, ఏడు సెల్​ఫోన్లు, విజిటింగ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.