హైదరాబాద్ మాదాపూర్ లో నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లు తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందిన నకిలీ జనరల్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ లు, కంప్యూటర్ మానిటర్ లు, హార్డ్ డిస్క్ లు, ప్రింటర్, 4 మొబైల్ ఫోన్ లతో పాటు 79 వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు.
నగరంలో వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందిన నకిలీ జనరల్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ లు తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. మొహమ్మద్ సర్వర్ తో పాటు మొత్తం నలుగురు ఒక ముఠాగా ఏర్పడి ఈ నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లు తయారు చేస్తున్నారు. అందులో ముగ్గురిని అరెస్ట్ చెయ్యగా మరొకరు పరారీలో ఉన్నాడని డీసీపీ తెలిపారు. త్వరలోనే మరో నిందితుడిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తమన్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ పేట్ లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ నకిలీ సర్టిఫికేట్ లు తయారుచేస్తున్నారు. నిందితుల నుండి 7.25 లక్షల విలువ చేసే సొత్తు ను సీజ్ చేశామని చెప్పారు డీసీపీ శిల్పవల్లి.