ఫేక్ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో బెయిల్స్

హనుమకొండ, వెలుగు: ఫేక్ ​డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో కోర్టులను మోసం చేస్తున్న ఉమ్మడి వరంగల్​ జిల్లాకు చెందిన ముగ్గురిని వరంగల్ టాస్క్​ఫోర్స్, పర్వతగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్ట్​జోన్ డీసీపీ కరుణాకర్​సోమవారం కమిషనరేట్​లో ప్రెస్​మీట్​పెట్టి వివరాలు వెల్లడించారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంతినికి చెందిన ఉడుతల రవీందర్​కేబుల్ టీవీ ఆపరేటర్. ఈ క్రమంలో కోర్టులో బెయిల్ ఇచ్చేందుకు అవసరమైన డాక్యుమెంట్లు, పూచీకత్తు సంతకాల కోసం సంగెం మండలంలోని సోమ్లాతండా, పర్వతగిరి మండలంలోని మూడెత్తుల తండా, ఏనుగల్, చౌటపల్లి తదితర గ్రామాల్లో కొంతమందిని సంప్రదించాడు. బెయిల్​ ష్యూరిటీకి సంతకాలు పెడితే కమీషన్​ఇస్తానని చెప్పాడు. సోమ్లా తండాకు చెందిన బానోత్​వెంకన్న, బానోత్​నరసింహ అనే అన్నదమ్ములతో కలిసి దందా స్టార్ట్​చేశాడు. వరంగల్, హనుమకొండ గ్రామాలకు సంబంధించిన పంచాయితీరాజ్ డిపార్ట్మెంట్​తో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శుల రబ్బర్​ స్టాంపులను హైదరాబాద్​లో రెడీ చేయించుకున్నాడు. వాటితో బెయిల్ కోసం పూచీకత్తు ఇస్తున్న వ్యక్తుల పేర్ల మీద సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి జారీ చేసినట్టుగా, ఇంటి విలువ, ఇంటి పన్నుకు సంబంధించిన ఫేక్​డాక్యుమెంట్లను సృష్టించేవాడు. 

48 మందికిపైగా ష్యూరిటీ

ఇప్పటి వరకు బానోత్​ వెంకన్న, బానోత్ నరసింహతో ఎక్కువ కేసుల్లో ష్యూరిటీ ఇప్పించాడు. వారితోపాటు సోమ్లాతండా, మూడెత్తుల తండా, ఏనుగల్, చౌటపల్లికి చెందిన మరో 50 మందితో సంతకాలు పెట్టించి వివిధ కేసుల్లోని నిందితులకు బెయిల్​ఇప్పించాడు. ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్​జిల్లాలోని 29 కోర్టుల్లో 48 మందికి చెందిన 691 కేసుల్లో ష్యూరిటీ ఇప్పించాడు. అయితే సోమవారం ఉదయం టాస్క్ ఫోర్స్, పర్వతగిరి పోలీసులు ఏనుగల్ లో తనిఖీ చేస్తుండగా తన వెహికల్​లో రవీందర్ అటుగా వచ్చాడు. చెక్​చేయగా గ్రామ పంచాయతీ కార్యదర్శి, పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించి రౌండ్ షీల్డ్ రబ్బర్ స్టాంపులు, ఇంటి విలువ, ఇంటి పన్ను రశీదులు కనిపించాయి. రవీందర్​ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బయటపడింది. రవీందర్​సమాచారంతో వెంకన్న, నరసింహను అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 పంచాయతీ కార్యదర్శి రబ్బర్ స్టాంపులు, రెండు గ్రామ సచివాలయం స్టాంపులు, నకిలీ ఇంటి పన్ను రశీదులు, ఇంటి విలువ డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు, పాస్​పోర్ట్​సైజు ఫొటోలు, మూడు  సెల్‌‌ఫోన్లు, బైక్, రూ.3 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే వీరిపై పర్వతగిరి పీఎస్ లో 4 కేసులు నమోదు అయినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్​ఫోర్స్​ఏసీపీ ఎం.జితేందర్ రెడ్డి, సీఐ కొమ్మూరి శ్రీనివాసరావు, పర్వతగిరి ఎస్సై దేవేందర్, టాస్క్​ఫోర్స్ ఎస్సై లవణ్ కుమార్ ఇతర సిబ్బందిని డీసీపీ అభినందించారు.