ఒక్కో సర్టిఫికేట్​ కు రూ.50 వేల నుంచి లక్ష వసూలు 

  • ఫెయిలైన స్టూడెంట్లకు ఫేక్​ సర్టిఫికేట్లు
  • ఒక్కో సర్టిఫికేట్​ కు రూ.50 వేల నుంచి లక్ష వసూలు 
  • ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఆరుగురు స్టూడెంట్స్​
  • ధర్మసాగర్​ మండలానికి చెందిన ఇద్దరు యువకుల అరెస్ట్ 

హనుమకొండ, ధర్మసాగర్​, వెలుగు: డిగ్రీ, పీజీ పరీక్షల్లో  ఫెయిల్​ అయిన, మధ్యలో చదువు ఆపేసిన  స్టూడెంట్లకు ఫేక్​ సర్టిఫికేట్లు అమ్ముతున్న  ఇద్దరు యువకులను వరంగల్ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర రెండు స్మార్ట్​ ఫోన్లు, ఫేక్ సర్టిఫికేట్ల  జిరాక్స్​కాపీలు స్వాధీనం చేసుకున్నారు.  ధర్మసాగర్​ మండలం మల్లక్ పల్లి కి చెందిన నరిశెట్టి పున్నంచందర్​, నారాయణగిరికి చెందిన బుద్దె దిలీప్​ దగ్గరి బంధువులు. వీరిలో పున్నంచందర్​కు ఇదివరకే ఫేక్ సర్టిఫికేట్ల గ్యాంగ్ తో సంబంధం ఉంది.  అతని మీద కేపీహెచ్​బీ  పీఎస్​లో కేసు ఉంది.  ఇటీవల పున్నంచందర్​ఢిల్లీలోని నోయిడాకు చెందిన సన్​ షైన్​ ఎడ్యుకేషన్​ కన్సల్టెన్సీ నిర్వాహకుడు అమాన్​ షేక్​ ను కలిసి  ఫేక్​ సర్టిఫికేట్ల దందా మొదలుపెట్టాడు.  

ధర్మసాగర్​ మండలంలో ఫెయిల్​ అయిన, చదువు మానేసిన వారి వివరాలను దిలీప్​ సేకరించేవాడు. ఒక్కో సర్టిఫికేట్ రూ.50 వేలు నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసేవారు.  అమాన్​ షేక్​ ​ వివిధ యూనివర్సిటీల పేరున తయారు చేయించిన ఫేక్​ సర్టిఫికేట్లను పున్నం చందర్​ డబ్బులు ఇచ్చిన వారికి ఇచ్చేవారు. ధర్మసాగర్​ మండలంలో ఏడుగురి నుంచి  పున్నం చందర్​, దిలీప్​ డబ్బులు వసూలు చేశారు. వారిలో  నకిలీ సర్టిఫికేట్లు తీసుకున్న ఆరుగురు  దేశం దాటి వెళ్లిపోయారు.  ఉన్నత చదువులకోసం నలుగురు యూకే, ఒకరు ఆస్ట్రేలియా, ఒకరు అమెరికా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరిని వరంగల్ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు సోమవారం  అదుపులోకి తీసుకుని ధర్మసాగర్​ పోలీసులకు అప్పగించారు. కాగా ఢిల్లీకి  చెందిన అమాన్​ షేక్​ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.